నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం... దక్షిణ కొరియాకు హెచ్చరిక

నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం... దక్షిణ కొరియాకు హెచ్చరిక

ఉత్తర కొరియా క్షిపణుల ప్రయోగం కొనసాగుతోంది. బుధవారం ఉత్తర కొరియా 10 క్షిపణులను ప్రయోగించింది. తూర్పు సముద్ర తీరం వైపు కిమ్‌ సైన్యం బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిందని సౌత్ కొరియా వెల్లడించింది. అమెరికా– దక్షిణకొరియా సైన్యాలు సంయుక్త గగనతల విన్యాసాలు నిర్వహించడంతో..ఈ రెండు దేశాలను హెచ్చించేందుకే నార్త్ కొరియా ఈ ప్రయోగం చేపట్టినట్లు సౌత్ కొరియా ఆరోపించింది. 

సౌత్ కొరియా అలర్ట్...
ఉత్తరకొరియా ప్రయోగించిన బాలిస్టిక్‌ క్షిపణుల్లో కొన్ని దక్షిణ కొరియా సముద్ర జలాల్లో పడ్డాయి. నార్తర్న్ లిమిట్ లైన్కు సౌత్గా ఉన్న అంతర్జాతీయ జాలాల్లో క్షిపణి పడినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. ఈ విషయాన్ని సౌత్ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ధృవీకరించారు. నార్త్ కొరియా క్షిపణులు ఇంత దగ్గరగా  పడటం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా అలెర్ట్ ప్రకటించింది. బంకర్లలోకి ప్రజలు వెళ్లాలని సూచించింది. నార్త్ కొరియా చర్య కవ్వింపు చర్యగా సౌత్ కొరియా అభివర్ణించింది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ జాతీయ భద్రత మండలి సమావేశానికి పిలుపునిచ్చారు. ఉత్తర కొరియా ప్రయోగాలను జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా కూడా తప్పపట్టారు. 

యుద్ధ విన్యాసాలపై ప్రతీకార చర్య...?
సౌత్ కొరియా అమెరికా విజిలెంట్ స్ట్రామ్ పేరిట యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అయితే విన్యాసాలను నార్త్ కొరియా ఖండించింది. తమపై దాడి చేయాలన్న దురుద్దేశంతోనే అమెరికా, సౌత్ కొరియాలు సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయని ఆరోపించింది. దీనికి ప్రతి చర్య ఉంటుందని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు అత్యంత సన్నిహితుడు  వర్కర్స్ పార్టీ కార్యదర్శి పాక్ జోంగ్ చోన్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే ఈ క్షిపణుల ప్రయోగం చేయడం గమనార్హం. విజిలెంట్ స్ట్రామ్ యుద్ధ విన్యాసాలపై ఉత్తర కొరియా చేస్తున్న వ్యాఖ్యలను అమెరికా ఖండించింది. సౌత్ కొరియా పట్ల తమకు ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను దౌత్యమార్గాల్లో పరిష్కరించుకోవాలని సూచించింది.

ఇది రెండోసారి...
తూర్పు సముద్రాన్ని జపాన్ సముద్రం అని కూడా అంటారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాకు చెందిన క్షిపణి తూర్పు సముద్రం దూసుకెళ్లడం ఇది రెండోసారి. అక్టోబర్ 28న ఉత్తర కొరియా తూర్పు సముద్రంవైపు బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ను పరీక్షించింది. మరోవైపు నెల రోజుల వ్యవధిలో ఉత్తర కొరియా 8 సార్లు క్షిపణి ప్రయోగం చేసింది. ఇక ఈ ఏడాది ఉత్తర కొరియా 40 కంటే ఎక్కువ బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించింది. వీటిలో చాలా వరకు క్షిపణులు జపాన్ మీదుగా ప్రయాణించి సముద్రంలో పడ్డాయి.