
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, హర్యానా సహా ఉత్తరాది రాష్ట్రాలు ఎండ వేడికి కుతకుతా ఉడుకుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాడ్పులతో టెంపరేచర్లు రికార్డ్ స్థాయిలో 45 డిగ్రీ సెల్సియస్ లు దాటి నమోదవుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో జనం మధ్యాహ్నం కాలు బయటపెట్టేందుకే జంకుతున్నారు. ఢిల్లీలోని నజఫ్ గఢ్ లో దేశంలోనే అత్యధికంగా మంగళవారం మధ్యాహ్నం 3.33 గంటలకు 47.4 డిగ్రీ సెల్సియస్ ల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఢిల్లీలో కరెంట్ డిమాండ్ ఏకంగా 7,717 మెగావాట్లకు చేరింది. ఢిల్లీలో కరెంట్ కు ఇంత పీక్ డిమాండ్ ఏర్పడటం ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు.
గతేడాది ఆగస్టు 22న అత్యధికంగా 7,438 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదు కాగా, ఇప్పుడు అంతకుమించిన డిమాండ్ నమోదైందన్నారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వచ్చే కొన్ని రోజులపాటు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. ఎండలు మండిపోతుండటంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. స్కూళ్లకు హాలీడేస్ ప్రకటించాలని, ఎడ్యుకేషన్ కు ఇబ్బంది కలగకుండా ఆన్ లైన్ క్లాసులు నిర్వహించుకోవాలని ఆదేశించాయి. ఢిల్లీలో మే 11 నుంచి జూన్ 30 వరకూ, పంజాబ్ లో మే 21 నుంచి జూన్ 30 వరకూ స్కూళ్లకు సమ్మర్ హాలీడేస్ ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇదివరకే ఆదేశాలు జారీ చేశాయి.
పొద్దున 7 గంటలకే..
ఉత్తరాది రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం 7 గంటలకు సైతం పెద్ద ఎత్తున టెంపరేచర్లు నమోదయ్యాయి. గంగా నగర్ (రాజస్థాన్)లో 45.11, వడోదర (గుజరాత్)లో 44.93, బికనీర్ (రాజస్థాన్)లో 44.87, గ్వాలియర్ (మధ్యప్రదేశ్)లో 44.5, హిస్సార్ (హర్యానా)లో 44.39, ఝాన్సీ(యూపీ)లో 44.31 ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ఇక మధ్యాహ్నం హర్యానాలోని సిర్సాలో 47.2 డిగ్రీ సెల్సియస్ ల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, వాతావరణ మార్పు సమస్య కారణంగా ఉత్తరాదిన తరచూ హీట్ వేవ్స్ పరిస్థితులు వస్తున్నాయని పలువురు క్లైమేట్ సైంటిస్టులు హెచ్చరించారు. ఈ అంశంపై వారు స్టడీ చేసి ఇటీవల నివేదికను విడుదల చేశారు. క్లైమేట్ చేంజ్ నివారణకు చర్యలు చేపట్టకపోతే మున్ముందు మరింత గడ్డు పరిస్థితులు తప్పవని స్పష్టం చేశారు.