తెలంగాణలో కరోనా సోకని ఊరిదే..

తెలంగాణలో  కరోనా సోకని ఊరిదే..

కొవిడ్​..ఎవరి నోట విన్నా ఇదే మాట. ఏ ఇద్దరు కలిసినా దీని గురించే డిస్కషన్​. ఊరు, వాడ అనే తేడాలేకుండా ప్రపంచమంతటా ఈ వైరసే ఉంది​. కానీ, ఆ లిస్ట్​లో రాగోజీపేట అనే ఊరు మాత్రం లేదు. జగిత్యాల జిల్లా  మేడిపల్లి మండలంలో ఉన్న ఈ  ఊళ్లోకి కరోనాకి ‘నో ఎంట్రీ’. కరోనా వైరస్​ జాడే కనిపించదు అక్కడ. వైరస్​ కట్టడికి ఊరంతా ఏకమై చేసిన ఒక ఆలోచన రాగోజీపేటని కరోనా నుంచి కాపాడింది.
‘మా ఊరికి ఎవరూ రావొద్దు. మేమూ మీ ఊళ్లకి రాం’– రాగోజీపేట జనం మాట ఇది. కరోనా నుంచి  తమని తాము కాపాడుకోవడానికి ఊరి వాళ్లు చేసిన ఆలోచన అది. కిందటి ఏడాది రాగోజీపేటలో ఒకతనికి  కొవిడ్​​ పాజిటివ్​ వచ్చింది. దాంతో అలర్ట్​ అయిన వాళ్లు ఆ ఊరికి రాకపోకల్ని ఆపేశారు. ఊళ్లో మాస్క్​ని కంపల్సరీ చేశారు. అంతేకాకుండా ఆ ఊరికి నాలుగు దిక్కులా నలుగురు మనుషుల్ని కాపలా పెట్టారు.  తమ ఊళ్లోకి కొత్తవాళ్లు ఎవరినీ రానీయకుండా వాళ్లు అడ్డుకుంటారు. కొత్త వాళ్లు ఎవరైనా వస్తే ఊరి పొలిమేరల్లోనే వాళ్ల వివరాలన్నీ అడుగుతారు. అత్యవసరం అయితే పంచాయతీ పెద్దలతో మాట్లాడాకే ఊళ్లోకి అడుగుపెట్టనిస్తున్నారు. బలమైన కారణం లేకపోతే వచ్చినవాళ్లు వచ్చినట్టే వెనక్కి పోవాల్సిందే. ఇదేకాకుండా ఇరవై రోజుల క్రితం నుండి సెల్ఫ్​ లాక్​డౌన్​లోకి వెళ్లింది రాగోజీపేట. 

అవగాహన కోసం

 దేశ వ్యాప్తంగా ఉన్న కరోనా అప్​డేట్స్​​ని, అది దరిచేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని మైకులో చెప్తుంటారు ఆ ఊళ్లో ప్రతిరోజూ. అలాగే  ఉదయం, సాయంత్రం రెండేసి గంటల చొప్పున మాత్రమే ఊళ్లోని దుకాణాలు తెరుస్తారు. రాత్రి తొమ్మిది తర్వాత కారణం లేకుండా ఎవరైనా రోడ్డు మీదకు వస్తే వెయ్యి రూపాయలు ఫైన్​ వేస్తారు. మరో ప్రత్యేకత ఏంటంటే, గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లోనూ ఫిజికల్​​ డిస్టెన్స్​ పాటించాల్సిందే. ఈ జాగ్రత్తలన్నింటితో పాటు రోజూ ఊరంతా హైపోక్లోరైడ్​​తో శానిటైజ్​ చేస్తారు. 
::: బైరి రాజేశ్‌ గౌడ్​, జగిత్యాల టౌన్, వెలుగు