
వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఒక్క చుక్క నీరు వాడలేదని.. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బారేజ్ల నుంచి నీటిని ఎత్తిపోయాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిరూపయోగంగా ఉన్నప్పటికీ వరి సాగులో తెలంగాణ రికార్డ్ సృష్టించిందన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్నా రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కిందని చెప్పారు.
శనివారం (అక్టోబర్ 11) మంత్రి ఉత్తమ్ హన్మకొండలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బనకచర్ల ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కృష్ణా, గోదావరి జలాల వాటాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర హక్కులు కాపాడేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
గోదావరిపై ఏపీ ప్రభుత్వం చేపడుతోన్న బనకచర్ల ప్రాజెక్టుకు తెలంగాణ వ్యతిరేకమని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పామని గుర్తు చేశారు. అలాగే.. కర్నాటకలో ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంపుకు కూడా మేం వ్యతిరేకమని పునరుద్ఘాటించారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమున్న తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు.
కృష్ణా జలాల్లో 511 టీఎంసీలు ఏపీ తీసుకోవచ్చని.. తెలంగాణకు 299 టీఎంసీలు చాలని సంతకం చేసిందే కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. కానీ కృష్ణ జలాల్లో తెలంగాణకు 70 శాతం వాటా కోసం మేం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కృష్ణా బేసిన్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టలేదని.. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ మాత్రమే నిర్మించిందన్నారు.