మూడు జిల్లాల్లో ఒక్క మండలానికీ రెగ్యులర్ ఎంఈవో లేడు

మూడు జిల్లాల్లో ఒక్క మండలానికీ  రెగ్యులర్ ఎంఈవో లేడు

సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు : ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యా వ్యవస్థ గాడి తప్పుతోంది. 71 మండలాల్లో ఏ ఒక్క మండలానికి కూడా రెగ్యులర్ ఎంఈవో లేడు. హెచ్ఎంలు ఇన్​చార్జి మండల విద్యాధికారులుగా కొనసాగుతున్నారు. పదోన్నతులు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 2005 సంవత్సరంలో హెచ్ఎంలకు ఎంఈవోలుగా పదోన్నతులు కల్పించారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో విద్యాశాఖలో ప్రమోషన్స్ పూర్తిగా నిలిచిపోయాయి. కొత్త మండలాల్లోనూ మూడేండ్లుగా ఎంఈవో పోస్టులు మంజూరు చేయలేదు. ప్రతినెలా టీచర్లు రిటైర్డ్ అవుతుండగా, ఆ స్థానంలో ఉపాధ్యాయులను నియమించకపోవడంతో ఖాళీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతంలో బదిలీలు చేపట్టినా హెచ్ఎంలకు ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా స్థానాల్లో రెగ్యులర్ ఎంఈవోలకు బదులు స్కూల్ హెచ్ఎంలకు ఇన్​చార్జి ఎంఈవోలుగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. 

‘అదనపు’ భారం.. 

హెడ్ మాస్టర్లకు అదనంగా ఎంఈవోలుగా బాధ్యతలను అప్పగించడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక్కో ఎంఈవోను  రెండు, మూడు మండలాలు చూడమని చెప్పడంతో ఇటు స్కూళ్లలో కాన్సంట్రేషన్ చేయలేక.. అటు మండలాల్లో పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయక ఇబ్బందులు పడుతున్నట్టు హెచ్ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా తమ సర్వీసులో పొందాల్సిన ప్రమోషన్లు పొందలేక పోతున్నామని ఆందోళన చెందుతున్నారు. చాలామంది సీనియర్ హెచ్ఎంలు ప్రమోషన్లు పొందకుండానే రిటైర్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అర్హత గల హెచ్ఎంలకు వెంటనే ఎంఈవోలుగా ప్రమోషన్లు ఇవ్వాలని పలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇదీ పరిస్థితి.. 

సిద్దిపేట జిల్లాలో మొత్తం 24 మండలాలు ఉండగా, ఎక్కడ కూడా ఫుల్ చార్జి ఎంఈవోలు లేరు. తొమ్మిది మండలాల్లో మాత్రం ఎఫ్ఏసీ (ఫుల్ అడిషనల్ చార్జ్)తో విధులు నిర్వర్తిస్తున్నారు. మెదక్ జిల్లాలో 21 మండలాలు ఉండగా, కేవలం ముగ్గురు ఎంఈవోలే ఉన్నారు. వారుకూడా ఇన్​ర్జీలే కావడం గమనార్హం. నర్సాపూర్ ఎంఈవో బుచ్చానాయక్​ తొమ్మిది మండలాలు, కొల్చారం ఎంఈవో నీలకంఠంకు ఏడు మండలాలు, వెల్దుర్తి ఎంఈవో యాదగిరికి ఐదు మండలాల బాధ్యతలు అప్పగించారు. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పడిన 9 మండలాల్లోనూ ఎంఈవో పోస్టులు మంజూరు చేయలేదు. మిగతా 18 మండలాల్లో ఎంఈవో  పోస్టులు ఉన్నప్పటికీ హెచ్ఎంలకు ఇన్​చార్జి ఎంఈవోల బాధ్యతలు అప్పగించారు.