ఆరేండ్లలో యూనివర్సిటీల్లో ఒక్క పోస్టు కూడా నింపలే

ఆరేండ్లలో యూనివర్సిటీల్లో ఒక్క పోస్టు కూడా  నింపలే

తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసింది స్టూడెంట్లే. ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ గొంతెత్తిన స్టూడెంట్లు.. యూనివర్సిటీలను ఉద్యమ కేంద్రాలుగా మార్చారు. తెలంగాణ రాష్ట్రం వస్తే యూనివర్సిటీల రూపురేఖలు మారతాయని భావించారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లు గడుస్తున్నా యూనివర్సిటీలు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. ఉమ్మడి రాష్ట్రం నాటి కంటే సొంత రాష్ట్రంలో మరింత నిర్లక్ష్యానికి గురయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడంతో నిధులు రావడం లేదు. వీసీలు మొదలుకుని లెక్చరర్లు, అంటెండర్ల వరకూ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు.  దీంతో వర్సిటీల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.

 

రాష్ట్రంలో కొన్నేండ్లుగా యూనివర్సిటీల్లో లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయని కారణంగా వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో మూడు వేల మంది లెక్చర ర్ల అవసరం ఉంటే.. ప్రస్తుతం 700లోపు మాత్రమే లెక్చరర్లు పనిచేస్తున్నారు. వందేండ్లు పూర్తి చేసుకున్న ఉస్మానియా వర్సిటీలో 1,200 మంది లెక్చరర్ల అవసరం ఉంటే ప్రస్తుతం 400 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇక మిగతా వర్సిటీల పరిస్థితి చెప్పనక్కరలేదు. రిటైర్‌‌‌‌‌‌‌‌ అవుతున్న లెక్చరర్ల సంఖ్య పెరుగుతోంది తప్ప వారి స్థానంలో కొత్త వాళ్లు మాత్రం రావడం లేదు. దీంతో స్టూడెంట్లు.. సరిపడా లెక్చరర్లు లేకుండానే చదువు నేర్చుకుంటున్నారు. కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ లెక్చరర్లతో కాలం నెట్టుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. బోధనేతర సిబ్బంది కూడా సరిపడగా లేక పనిలో నాణ్యతా ప్రమాణాలు తగ్గుతున్నాయి. పది మంది చేసే పని ఒక్కరే చేయడం వల్ల కాలయాపన కూడా జరుగుతోంది. అన్ని యూనివర్సిటీల్లో వేల సంఖ్యలో బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ ఆరేండ్లలో ఒక అటెండర్ పోస్టు కూడా నింపలేదంటే.. పాలకులకు యూనివర్సిటీలపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది.

బడ్జెట్‌‌‌‌ సగమే ఇస్తున్నరు

యూనివర్సిటీలకు పరిశోధన, బోధన రెండు కళ్ల లాంటివి. అలాంటిది రాష్ట్రంలోని వర్సిటీల్లో పరిశోధనలు మొత్తం కుంటుపడ్డాయి. దీని వల్ల పేద, మధ్య తరగతి స్టూడెంట్లపై తీవ్రమైన భారం పడుతోంది. దశాబ్దాలుగా ఉన్నత చదువులకు దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంత స్టూడెంట్లు.. ఇప్పుడు యూనివర్సిటీల్లో చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ, వారి ఆసక్తికి తగ్గట్టుగా చదువును పొందలేకపోతున్నారు. ప్రొఫెసర్లు, లెక్చరర్లు లేని కారణంగా వారికి నాణ్యమైన చదువు అందడం లేదు. యూనివర్సిటీ అధికారుల ప్రతిపాదనల్లో సగానికి సగం బడ్జెట్‌‌‌‌ను మాత్రమే కేటాయిస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. అది సిబ్బంది జీతాలకు కూడా సరిపోవడం లేదు. దీంతో వారు జీతాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిధులు లేని కారణంగా స్టూడెంట్లకు కొత్త హాస్టళ్ల నిర్మాణం చేయడం లేదు. దీంతో శిథిలమైన భవనాల్లోనే బిక్కుబిక్కుమంటూ స్టూడెంట్లు గడుపుతున్నారు.

వీసీల నియామకంపై నిర్లక్ష్యం

త్వరలో అన్ని వర్సిటీలకు వీసీల నియామకం చేపట్టేలా గత అసెంబ్లీ సమావేశాల ముందు సీఎం కేసీఆర్‌‌‌‌ అధికారులకు ఆదేశాలిచ్చారు. కానీ, ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఒక ప్రజాప్రతినిధి సీటు ఖాళీ అయితే ఆరు నెలల లోపు భర్తీ చేసే ప్రక్రియ ఉన్న మన రాజ్యాంగంలో యూనివర్సిటీలకు వీసీలను నియమించడంపై ఎలాంటి గడువు లేకపోవడం దురదృష్టకరం. వీసీలు లేని కారణంగా యూనివర్సిటీలన్నీ అభివృద్ధికి నోచుకోవడం లేదు. వీసీల నియామకంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. సెర్చ్ కమిటీలు వేసినా ఇంతవరకూ ఏ యూనివర్సిటీకి(రెండు మినహా) వీసీలను నియమించలేదు. దీంతో ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌ల పాలన కొనసాగుతోంది.

రైతు బిడ్డలు చదువుకోవద్దా?

బంగారు తెలంగాణ అంటూ ఎన్నో పథకాలకు వేల కోట్లు ఖర్చుపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. యూనివర్సిటీల అభివృద్ధి దగ్గరకు వచ్చే సరికి మాత్రం నిధులు లేవని సాకులు చెబుతోంది. రైతుల అభివృద్ధే తమ ధ్యేయం అంటున్న ప్రభుత్వం.. రైతు బిడ్డలు చదివే వర్సిటీలను మాత్రం అభివృద్ధి చేయడం లేదు. గడిచిన ఆరేండ్లలో యూనివర్సిటీల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని యూనివర్సిటీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. అన్ని యూనివర్సిటీలకు వీసీలను, లెక్చరర్లను, బోధనేతర సిబ్బంది నియామకాలను చేపట్టాలి. ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి అన్ని వర్సిటీల రూపురేఖలు మారేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే సొంత రాష్ట్రంలో మన పాలకులపై స్టూడెంట్లు ఉద్యమం చేయవలసి వస్తుందని గ్రహించాలి.

– చింత ఎల్లస్వామి ఏబీవీపీ నేత, ఉస్మానియా వర్సిటీ