కూరగాయలు సాల్తలెవ్​

కూరగాయలు సాల్తలెవ్​
  • జనానికి తగ్గట్టు లేని సాగు
  • ఏటా అవసరమయ్యే వెజిటబుల్స్ 25 లక్షల 20 వేల టన్నులు
  • సరఫరా అవుతున్నవి 23 లక్షల 46 వేల టన్నులు
  • అందులో 60 శాతం ఇతర రాష్ట్రా ల నుం చే రాక
  • ఏటా కొరత 1 లక్షా 74 వేల టన్నులు

రాష్ట్రంలో జనాభాకు తగ్గట్టు కూరగాయల సాగు జరగడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా దిగుమతి చేసుకుంటున్నా ఏటా 1 లక్షా 73 వేల 300 టన్నుల కూరగాయల కొరత  వెంటాడుతోంది. రాష్ట్రంలో కోటీ 20 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగవుతుండగా.. అందులో 3 లక్షల 11 వేల ఎకరాల్లో మాత్రమే కూరగాయలు పండుతున్నాయి. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ స్టడీ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 325 గ్రాముల వెజిటబుల్స్​ను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం 200 గ్రాములు తీసుకున్నా రాష్ట్రంలో జనాభాకు తగ్గట్టు ఏడాదికి 25 లక్షల 20 వేల టన్నుల వెజిటబుల్స్ అవసరం. అయితే ప్రస్తుతం ఏడాదికి 23 లక్షల 46 వేల 700 టన్నులే సరఫరా అవుతున్నాయి. అందులో 60% కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నవేనని మార్కెటింగ్‌ వర్గాలు చెప్తున్నాయి. కొరతను గట్టెక్కించాలంటే అదనంగా కనీసం మరో లక్షల ఎకరాల కూరగాయల సాగు అవసరమని అంటున్నాయి.

పండే సీజన్లోనూ దిగుమతే

సాధారణంగా రాష్ట్రంలో అక్టోబర్​ నుంచి మార్చి వరకు కూరగాయల సాగు జరుగుతుంది. ఆ సమయంలోనూ 50 శాతం కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఎండాకాలంలో, అన్‌ సీజన్‌లో అది 60 నుంచి 70 శాతం వరకు ఉంటుంది. రాష్ట్రానికి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, బీహార్‌, ఢిల్లీ నుంచి  వెజిటబుల్స్​ దిగుమతి అవుతుంటాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి పలు రకాల కూరగాయలు వస్తుండగా ఉత్తరప్రదేశ్‌ నుంచి ఎక్కువగా ఆలుగడ్డలు వస్తుంటాయి. మహారాష్ట్ర , రాజస్థాన్‌ నుంచి ఉల్లిగడ్డలు, కర్నాటక నుంచి క్యాప్సికమ్‌, టమాటలు వస్తుంటాయి.

హైదరాబాద్‌లోనే 32,823 టన్నుల కొరత

హైదరాబాద్​లో నెలకు ఒక వ్యక్తి కూరగాయల వినియోగం 8.08 కిలోలు. రోజువారీగా తీసుకుంటే 269 గ్రాములు. నేషనల్‌ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సర్వేలో ఇది తేలింది. ఈ లెక్కన హైదరాబాద్‌లో ఏడాదికి 7,22,186  టన్నుల కూరగాయలు అవసరమవుతాయి. అంటే నెలకు 60,182 టన్నులు, రోజుకు 2006  టన్నుల వరకు కావాల్సిందే. అయితే ప్రస్తుతం ఇక్కడికి ఏటా 6,89,363 టన్నుల వెజిటబుల్స్  మాత్రమే సరఫరా అవుతున్నాయి. 32,823 టన్నుల కొరత వెంటాడుతోంది. దీన్ని అధిగమించాలంటే  హైదరాబాద్‌ చుట్టపక్కల జిల్లాల్లో కనీసం 41,840 ఎకరాల్లో కూరగాయల సాగు అవసరమని పలు అధ్యయనాల్లో తేలింది.

పండిస్తే గిట్టుబాటే

రాష్ట్రంలో కూరగాయల సాగుకు అనుకూలమైన నేలలు ఉన్నప్పటికీ పలు సమస్యలు రైతులను వేధిస్తున్నాయి. నీటి లభ్యత తక్కువగా ఉండటం, కూలీల కొరత, కోతుల బెడద వల్ల వెజిటబుల్స్​ను పండించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మార్కెట్​లో గిరాకీ ఉన్న  కూరగాయలు పండిస్తే లాభాలు వస్తాయని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు. సమస్యలను అధిగమించి కొత్త కొత్త పద్ధతుల్లో సాగు చేపట్టాలని సూచిస్తున్నారు.