2 నెలల్లో ఒక్క జాబ్ కూడా ఇయ్యలే : కడియం

2 నెలల్లో ఒక్క జాబ్ కూడా ఇయ్యలే : కడియం
  •   ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు 
  • ఎట్ల భర్తీ చేస్తరు?: కడియం

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండు నెలలవుతున్నా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది 2లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో ప్రకటించాలని అన్నారు. నోటిఫికేషన్ల కోసం యువత ఎదురు చూస్తున్నదని తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ నిర్వహించామని, ఎన్నికల కోడ్ కారణంగా భర్తీ ప్రక్రియ ఆగిపోయిందని గుర్తు చేశారు.

 ఆ పోస్టులు తామే భర్తీ చేశామంటూ కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేసుకోవడం సరికాదన్నారు. కొత్త సర్కారు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని తెలిపారు. ఆరు గ్యారంటీలకు రూ.53వేల కోట్లు కేటాయించారని, దాంట్లో 5 గ్యారంటీలకు దేనికి ఎంత కేటాయించారో చెప్పాలన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లను 18% పెంచుతామని హామీ ఇచ్చారని, నోటిఫికేషన్లు ఇచ్చేలోపే దీన్ని అమలు చేయాలని సూచించారు.

నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది: పొన్నం

న్యాయపరమైన చిక్కులు పరిష్కరించి పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఏప్రిల్ లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే.. ఇప్పటికీ భర్తీ చేయలేదన్నారు. టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేశామని తెలిపారు. చైర్మన్, సభ్యులను నియమించామని, నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని అన్నారు. మీ ఉద్యోగాలు పోయాయని, వేరే వాళ్లకు ఉద్యోగాలు రావనుకుంటే ఎలా అని బీఆర్ఎస్ సభ్యులనుద్దేశించి ప్రశ్నించారు. ఎక్కడ కూడా మేమే నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పలేదని గుర్తుచేశారు.