తల్లిని అవమానించడం మా సంస్కృతిలోనే లేదు: ప్రధాని మోడీపై తేజస్వీ యాదవ్ కౌంటర్ ఎటాక్

తల్లిని అవమానించడం మా సంస్కృతిలోనే లేదు: ప్రధాని మోడీపై తేజస్వీ యాదవ్ కౌంటర్ ఎటాక్

పాట్నా: తన తల్లిని అవమానించిన వారిని దేశ ప్రజలు క్షమించరంటూ కాంగ్రెస్, ఆర్జేడీపై ప్రధాని మోడీ చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్. ఒక తల్లి అందరికి తల్లి లాంటిందే. ఎవరి తల్లినీ అగౌరవపరచడం, అవమానించడం మా సంస్కృతిలో లేదని కౌంటర్ ఇచ్చారు. 

ప్రధాని మోడీ గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీని జెర్సీ ఆవు అని పిలిచారని గుర్తు చేశారు తేజస్వీ యాదవ్. అలాగే బీహార్ సీఎం నితీష్ కుమార్‎ను ఉద్దేశించి గతంలో డీఎన్ఏ వ్యాఖ్యలు ఎవరూ చేశారని మోడీని ప్రశ్నించారు. మహిళలను అవమానించే సంస్కృతి బీజేపీకే ఉందని.. గతంలో బీజేపీ నాయకులు పదే పదే మహిళలను అవమానించిన మోడీ మౌనంగా ఉన్నారని చురకలంటించారు.

బీహార్‎లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దర్భంగాలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఆయన దివంగత తల్లిపై ఓ కాంగ్రెస్ కార్యకర్త అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. మోడీ, ఆయన తల్లిని కాంగ్రెస్ కార్యకర్త అసభ్య పదజాలంతో దూషించడంతో తీవ్ర దుమారం రేపింది. 

ఈ ఘటనపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. కాషాయ పార్టీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా వంటి నేతలు కాంగ్రెస్ కార్యకర్త వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే తనను, తన తల్లిని కాంగ్రెస్ కార్యకర్త దూషించడంపై ప్రధాని మోడీ కూడా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్, ఆర్జేడీలపై విమర్శలు వర్షం కురిపించారు మోడీ.

 నన్ను, దివంగత నా తల్లిని దూషించిన వారిని నేను క్షమిస్తాను.. కానీ ఈ దేశ ప్రజలు తమ తల్లిని అవమానించడాన్ని ఎప్పుడూ సహించరని  అన్నారు. ముఖ్యంగా బీహార్ ప్రజలు క్షమించరని పేర్కొన్నారు. తల్లులను దూషించే కాంగ్రెస్, ఆర్జేడీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీహార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రధాని మోడీ. ఈ క్రమంలోనే మోడీ వ్యాఖ్యలపై తేజస్వీ యాదవ్ పై విధంగా ఎదురు దాడి చేశారు.