కరోనా పేరుతో జీఎస్టీ పరిహారం ఎగ్గొడ్తరా.?

కరోనా పేరుతో జీఎస్టీ పరిహారం ఎగ్గొడ్తరా.?

హైదరాబాద్, వెలుగు: యాక్ట్ ఆఫ్ గాడ్ పేరిట, కరోనా పేరిట కేంద్రం ప్రభుత్వం లక్షా 35వేల కోట్ల నష్ట పరిహారాన్ని ఎగ్గొట్టాలని చూస్తోందని రాష్ట్ర ఫైనాన్స్​ మినిస్టర్​ హరీశ్​రావు ఆరోపించారు. జీఎస్టీ చట్టం ప్రకారం 14 శాతం గ్రోత్ రేట్ ఆధారంగా.. రాష్ట్రాలకు ఆదాయం తగ్గితే కేంద్రం పరిహారం చెల్లించాల్సిందేనని చెప్పారు. సోమవారం జీఎస్టీపై రాజస్థాన్, ఢిల్లీ, చత్తీస్‌‌గఢ్, జార్ఖండ్, పంజాబ్, కేరళ, పశ్చిమబెంగాల్, పాండిచ్చేరి, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల ఫైనాన్స్​ మినిస్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో హరీశ్​రావు పాల్గొన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు 3 లక్షల కోట్లు ఇవ్వాలని.. కానీ సెస్​ తగ్గించి, లక్షా 65 వేల కోట్లే ఇస్తామనడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి మూడేళ్లు అయిందని.. జీఎస్టీ, ఐజీఎస్టీ డబ్బులు మిగిలితే కేంద్రం కన్సాలిడేట్ ఫండ్ లో జమ చేసుకుందని అన్నారు. ఇప్పుడు ఆదాయం తగ్గితే రాష్ట్రాలను అప్పులు తీసుకొమ్మని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందరికీ ఇన్​కం తగ్గింది

జీఎస్టీ పరిహారాన్ని తగ్గించడాన్ని ఏ మాత్రం ఒప్పుకోబోమని హరీశ్  అన్నారు. కరోనా ఎఫెక్ట్​తో కేంద్ర ప్రభుత్వానికే కాదని, రాష్ట్ర ప్రభుత్వాలకు తీవ్ర నష్టం జరిగిందని.. అందువల్ల సెస్ తగ్గిస్తామనడం సరి కాదని పేర్కొన్నారు. తెలంగాణ నాలుగు నెలల్లో 34 శాతం అంటే.. రూ.8వేల కోట్ల ఆదాయం కోల్పోయిందని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని.. రాష్ట్రాలకు విరివిగా నిధులిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘‘జీఎస్టీలో చేరడం వల్ల రాష్ట్రం నష్టపోతుందని ఆనాడే తర్జనభర్జన పడ్డాం. 2016, 2017లో రాష్ట్రం 22 శాతం గ్రోత్ రేట్ సాధించింది. ఈ లెక్కన తెలంగాణ జీఎస్టీలో చేరకుంటే 25వేల కోట్లు అదనంగా వచ్చేవి. జీఎస్టీలో చేరి సెస్ రూపంలో రూ.18 వేల 32 కోట్లు చెల్లించి.. కేవలం రూ.3,200 కోట్లు మాత్రమే పొందాం. అప్పట్లో యూపీఏ సర్కారు కూడా రాష్ట్రాలకు మాట ఇచ్చి తప్పింది. ఎన్డీయే కూడా హామీలు ఇచ్చింది. ఇప్పుడు చట్టాన్నే ఉల్లంఘిస్తోంది. పెద్ద మనిషిగా వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చట్టబద్ధంగా అందాల్సిన నిధులను ఇవ్వడం లేదు. పైగా అప్పులు తీసుకోవాలని సూచించడాన్ని వ్యతిరేకిస్తున్నాం..” అని హరీశ్​ చెప్పారు. క్రూడాయిల్ రేట్లు తగ్గిన టైంలో కేంద్రం పెట్రోల్, డీజిల్ మీద సెస్​ పెంచి.. లక్షల కోట్లు ఆదాయం పొందుతోందన్నారు. రాష్ట్రాల ఇన్​కంలో పరిమితులు ఉన్నాయని, కేంద్రం అనుమతితోనే రాష్ట్రాలు ఏదైనా చేయాల్సి ఉందని గుర్తు చేశారు. కరోనా ఎఫెక్ట్​ వల్ల ట్యాక్సులు కట్టబోమని జనం అంటే దేశం, రాష్ట్రం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కేంద్రమే రుణం తీసుకుని.. రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గల్వాన్ నుంచి తరిమినా బుద్ధి మార్చుకోని చైనా