
- బొల్లాంట్ ఇండస్ట్రీస్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: అపార్ట్‌మెంట్‌లో కారు పార్కింగ్ సమస్య ఉందని చెప్పి మెయింటెనెన్స్ చెల్లించకపోవడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. పార్కింగ్ వివాదాన్ని తగిన న్యాయ వేదిక వద్ద పరిష్కరించుకోవాలేగానీ, మెయింటెనెన్స్ చెల్లించకపోవడం సబబు కాదని తేల్చింది. తెలంగాణ అపార్ట్‌మెంట్స్ (నిర్మాణం–యాజమాన్య ప్రమోషన్) చట్టం–1987ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది.ఈ చట్టం ద్వారా అపార్ట్‌మెంట్ అసోసియేషన్లకు అధికారాలు సంక్రమించాయని చెప్పింది.
చట్టంలోని సెక్షన్ 21 రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ బొల్లాంట్ ఇండస్ట్రీస్ ఎండీ శ్రీకాంత్ బొల్లా దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల కొట్టేసింది. పిటిషనర్ శ్రీకాంత్ సోమాజిగూడలోని బాబుఖాన్ మిలీనియం సెంటర్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో రెండు ఫ్లాట్‌లను తీసుకుని అందులో తన బొల్లాంట్ ఇండస్ట్రీస్ కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. పార్కింగ్ స్థల వివాదం కారణంగా అసోసియేషన్‌కు నిర్వహణ చార్జీలు చెల్లించలేదు. దీంతో అతని ఫ్లాట్‌కు నీటి సరఫరా నిలిపివేస్తూ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.
దీనిపై కారు పార్కింగ్ వివాదాన్ని తగిన వేదిక వద్ద పరిష్కరించుకోకుండా చట్టాన్ని ప్రశ్నించడాన్ని డివిజన్ బెంచ్ తప్పుపట్టింది. అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌కు అధికారాలు లేకపోతే చట్టం వల్ల ఉపయోగం ఉండదని అభిప్రాయపడింది.అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ యజమాని నిర్వహణ చార్జీలు చెల్లించకపోవడాన్ని తప్పుపట్టింది. ప్రాథమిక హక్కులకు కూడా సహేతుకమైన పరిమితులు ఉన్నాయని చెప్పింది.