
- సీఎం నుంచి ఎమ్మెల్యేల దాకా ఎవరికీ సౌలతుల్లేవు
- హైకోర్టులో ప్రభుత్వ కౌంటర్
- సెక్రటేరియెట్ ఇంకా దారుణంగా ఉంది
- సీఎం బ్లాక్ చుట్టూ ఫైరింజన్ కూడా తిరగలేదు
- ఏపీ బ్లాక్ అయితే బూత్ బంగ్లాలా మారింది
- విధాన నిర్ణయంలో కోర్టులు జోక్యం చేసుకోజాలవు
- ప్రశ్నించే అధికారం పిటిషనర్లకు లేదని వ్యాఖ్య
- కూల్చివేతలపై పిల్స్ కొట్టేయాలని విజ్ఞప్తి
సచివాలయం, ఎర్రమంజిల్ కూల్చివేతలను అడ్డుకోవాలంటూ దాఖలైన పిల్స్ అన్నింటినీ కొట్టేయాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ మంగళవారం ఈ మేరకు రెండు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్ బిల్డింగ్స్ చాలీచాలనట్లుగా ఉన్నాయన్నారు. ‘‘సీఎం,విపక్ష నేత, స్పీకర్, కౌన్సిల్ చైర్మన్‌లకు వసతులు పూర్తి స్థాయిలో లేవు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు విడిగా ఉండేందుకు సౌకర్యాల్లేవు. మినిస్టర్స్ సమావేశమైతే అధికారులు బయట ఉండాల్సివస్తోంది. అసెంబ్లీ భవనాలను చాలాసార్లు రిపేర్లు చేశారు. అందుకే కొత్త అసెంబ్లీ కట్టాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ముందు ఆర్ అండ్ బి అధికారుల కమిటీ అసెంబ్లీ బిల్డింగ్స్‌ను పరిశీలించింది. అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరపడం సరైన నిర్ణయం కాదని చెప్పింది. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకునే రాష్ట్ర చట్ట సభల ప్రాంగణాన్ని నిర్మించాలని క్యాబినెట్ ఏకగ్రీవంగా విధాన నిర్ణయం తీసుకుంది. దాన్ని ప్రశ్నించే అధికారం పిటిషనర్లకు లేదు. ఇందులో కోర్టులూ జోక్యం చేసుకునేందు ఆస్కారం లేదు. అందుకే ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మాణాన్ని సవాల్ చేసిన పిల్స్‌ను కొట్టేయాలి” అని కోరారు. సచివాయలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెప్పారు. ‘‘సీఎం ఉండే సీ బ్లాక్ చుట్టూ ఫైరింజన్ తిరిగేందుకు చోటు కూడా లేదు. అ బిల్డింగ్‌లోనే సీఎస్ ఉంటారు. క్యాబినెట్ మీటింగూ అక్కడే జరుగుతుంది. అక్కడ అగ్గి రాజుకుంటే రక్షణ కరువే. ఏపీకి ఇచ్చిన బిల్డింగులైతే బూత్ బంగ్లాలయ్యాయి. పిటిషనర్లు చెబుతున్నట్టు సెక్రటేరియట్ బిల్డింగులు 70 ఏండ్ల దాకా ఉండవు. చాలా బిల్డింగ్స్ చుట్టూ ఫైరింజన్లు తిరిగేలా లేవు. ఎల్ బ్లాక్ దుస్థితైతే వర్ణనాతీతం. కార్ల పార్కింగూ సమస్యే. విజిటర్స్‌కు సరైన వసతి లేదు. సెక్రటేరియట్‌లో ఇలాంటి పరిస్థితుల్ని నివారించేందుకు అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో, అత్యాధునిక సాంకేతికతతో పాలన అందించాలనే కొత్త భవనాల్ని కట్టాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. ఇక, హుడా నిబంధనల మేరకు ఎర్రమంజిల్ బిల్డింగ్ 1998లో హెరిటేజ్ సంపదగానే ఉండేది. 2015లో ఆ జాబితా నుంచి దాన్ని తీసేశారు. హెరిటేజ్ యాక్ట్ ప్రకారం కూడా అది వారసత్వ ఆస్తి కాదు” అని కౌంటర్‌లో పేర్కొంది.