ఆస్కార్ స్టేజి‌పై 'నాటు నాటు'కు అమెరికన్ డ్యాన్సర్ లైవ్ పర్ఫార్మెన్స్

ఆస్కార్ స్టేజి‌పై 'నాటు నాటు'కు అమెరికన్ డ్యాన్సర్ లైవ్ పర్ఫార్మెన్స్

భారతీయులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆస్కార్ అవార్డ్స్ వేడుక మరో కొద్ది గంటల్లోనే మొదలు కాబోతుంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ కు ఇప్పటికే ఎన్నో రివార్డులతో పాటు అవార్డులు కూడా వచ్చాయి. ఇక ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో మార్చి 12న జరగబోయే ఈ వేడుకలో నాటు నాటు సాంగ్ కు లైవ్ డ్యాన్స్ పర్ఫామెన్స్ ఎవరిస్తారన్న అంశంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమాలో నటించి, ఈ సాంగ్ కు అద్భుతమైన స్టెప్స్ వేసిన స్టార్ హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రదర్శన ఇవ్వబోతున్నారా అన్న చర్చ ఇప్పటికే మొదలైంది. కానీ తారక్ ఇటీవలే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఆస్కార్ వంటి స్టేజి పై పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కచ్చితమైన ప్రాక్టీస్ అవసరమని, కానీ, తమకు రిహార్సల్స్ చేయడానికి సమయం కుదరలేదు అంటూ చెప్పారు. దీంతో తారక్, చెర్రీ పర్ఫార్మ్ చేయడం లేదని తేలిపోయింది. మరి ఇంకెవరు ఈ సాంగ్ పై లైవ్ పర్ఫామెన్స్ అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. 

ఈ సమయంలోనే ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్ కు తానే లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చేదంటూ అమెరికన్ డ్యాన్సర్, నటి లారెన్ గోట్లిబ్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైంది ఈ వేదిక అని, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి తాను చాలా ఉత్సాహంగా ఉన్నానంటూ రాసుకొచ్చింది. ప్రముఖ అమెరికన్ డాన్స్ షో ద్వారా పాపులర్ అయిన ఈ భామ.. ప్రభుదేవా నటించిన హిందీ మూవీ ABCD మూవీ ద్వారా ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత బాలీవుడ్ లోని ప్రముఖ డాన్స్ షోలో కంటెస్టెంట్ గా, జడ్జిగా చేసింది. ఇప్పుడు ఆస్కార్ వేదిక పై వరల్డ్స్ ఫేమస్ సాంగ్ ని పర్ఫార్మ్ చేసే అవకాశం దక్కించుకుంది. ఇదే స్టేజి పై మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో పాటు పాట పాడిన సింగర్స్ రాహుల్ సిప్లిగుంజ్, కాలభైరవ కూడా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుండడం విశేషం.