
- వైఎస్ జమానాలో జెట్ స్పీడ్‌తో సాగిన పనులుఆ తర్వాత డెడ్ స్లో..
- 6.21 లక్షల ఎకరాల ఆయకట్టులో.. నీరందుతున్నది 1.5 లక్షల ఎకరాలకే!
- కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెడితేనే బీళ్లకు నీళ్లు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం.. ఎప్పుడో 19 ఏళ్ల కింద ప్రారంభించిన ఈ భారీ సాగునీటి ప్రాజెక్ట్ నేటికీ లక్ష్యం చేరలేదు. ఎనిమిది జిల్లాల్లో 6.21 లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉన్నప్పటికీ కేవలం 1.5 లక్షల ఎకరాలకు మించి నీళ్లివ్వడం లేదు. మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీలు లేకపోవడంతో పూర్తి ఆయకట్టుకు నీరందడం లేదు. ఏటా 60 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవాల్సిన ఈ స్కీం కింద కేవలం 9 టీఎంసీల నీళ్లను మాత్రమే లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి. వైఎస్ సీఎంగా ఉన్న కాలంలో దేవాదుల పనులు జెట్‌స్పీడ్‌తో జరిగాయి. ఆ తర్వాత కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యంతో పనుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది. పదేండ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరడంతో దేవాదుల పనులు ఊపందుకుంటాయని రైతులు ఆశిస్తున్నారు.
రూ.10 వేల కోట్లు ఖర్చు చేసినా..
దేవాదుల ప్రాజెక్ట్ కింద జనగామ జిల్లాలో 3,04,210 ఎకరాలు, వరంగల్జిల్లాలో 99,007, సిద్దిపేట జిల్లాలో 91,844, హనుమకొండ జిల్లాలో 77,285, యాదాద్రి, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలలో కలిపి 48 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాజెక్ట్ కింద మొత్తం 6.21 లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉండగా వీటిలో 5.57 లక్షల ఎకరాలకు కాలువల ద్వారా, 64 వేల ఎకరాలకు చెరువుల కింద సాగు నీరందించాలి. 2004లో రూ.6,016 కోట్ల అంచనా వ్యయంతో ఫేజ్‒1,ఫేజ్‒2, ఫేజ్‒3 కింద పనులు చేపట్టారు.
అయినప్పటికీ 1.5 లక్షల ఎకరాలకు మాత్రమే సాగు నీరందిస్తున్నారు. మూడు దశల్లో కలిపి 17 రిజర్వాయర్లను నిర్మించాలి. ధర్మసాగర్, నర్సింగపూర్, ఆర్‌ఎస్‌ఘన్‌పూర్, అశ్వరావుపల్లి, చిటకోడూరు, గండిరామారం, బొమ్మకూరు, వెల్దండ, తపాస్‌పల్లి, నష్కల్, పాలకుర్తి, చెన్నూరు, నవాబ్‌పేట, లద్నూర్, కన్నెబోయినగూడెం, మాసిరెడ్డి చెరువు, ఐనాపూర్‌లను రిజర్వాయర్లుగా మార్చి కాలువల ద్వారా పంట పొలాలకు సాగు నీరందించాలి. ఇప్పటిదాకా ఈ ప్రాజెక్ట్‌పై రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. అయినా ఇంకా 4.5 లక్షల ఎకరాల పంట పొలాలకు సాగునీరందించడానికి కాలువల నిర్మాణం పూర్తి కాలేదు. 2018‒19లో 2.90 లక్షల ఎకరాలు, 2019‒20లో 1.10 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా ఆయకట్టు స్థిరీకరణ పనులు పూర్తిచేస్తామని అప్పటి సర్కారు ప్రకటించినా నేటికీ పనులు పూర్తి కాలేదు.
రూ.14 వేల కోట్లకు పెరిగిన అంచనా వ్యయం
దేవాదుల ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం రూ.14 వేల కోట్లకు మించి పెరిగింది. 2004లో రూ.6,016 కోట్ల అంచనాతో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ఇంజినీర్లు భావించారు. 2010లో రూ.9,427.73 కోట్లకు, ఆ తర్వాత 2016 నాటికి రూ.13,445.44 కోట్లకు చేరింది. అయినా పనులు పూర్తి కాకపోవడంతో 2022లో మూడోసారి అంచనా వ్యయాన్ని రూ.14,729 కోట్లకు పెంచారు. పనులు పూర్తిచేయడానికి పెట్టే గడువులు(ఈఓటీ) పెంచుకుంటూ పోతున్నారు. ఫేజ్‒1 పనులు 2005లోనే పూర్తికావాలి. గడువు దాటి 18 ఏళ్లవుతోంది. ఇప్పటికీ ప్యాకేజీ 45, ప్యాకేజీ 46 పనులు పూర్తికాలేదు. ఫేజ్‒2 పనులు కూడా 2007 నాటికే పూర్తికావాల్సి ఉంది.
16 ఏండ్లయినా అశ్వరావుపల్లి, చీటకోడూరు డిస్ట్రిబ్యూటరీ పనులు 50 శాతం కూడా పూర్తికాలేదు. ఇక ఫేజ్‒3 పనులు పరిశీలిస్తే ఇంకా దారుణంగా ఉంది. గడువు దాటి 14 ఏళ్లు అవుతున్నా 8 ప్యాకేజీల కింద జరుగుతున్న పనులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఏఐబీపీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇంజినీరింగ్ పనులకు సాయం అందిస్తోంది. ప్రతీయేటా ఖర్చు చేసిన మొత్తంలో 25 శాతం నిధులను అందిస్తుంది. దేవాదుల ప్రాజెక్టులో మొత్తం 32,750 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా 29,694 ఎకరాల భూమిని సేకరించారు. ఇంకా సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేసి 3,057 ఎకరాలు కొనుగోలు చేయాల్సి ఉంది.
భారీ వరదలను తట్టుకున్న పంప్ హౌజ్
లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ సర్కారు గోదావరి నదిపై కట్టిన కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌజ్‌లు గతేడాది వచ్చిన వరదల్లో మునిగిపోయాయి. 29 బాహుబలి మోటార్లు దెబ్బతిన్నాయి. 6 మోటార్లు పనికిరాకుండా పోయాయి. వేల కోట్ల నష్టం వాటిల్లింది. కానీ అదే గోదావరిపై 19 ఏళ్ల కిందట ములుగు జిల్లా కన్నాయిగూడేం మండలం దేవాదుల దగ్గర కట్టిన పంప్‌హౌజ్ మాత్రం చెక్కుచెదరలేదు. భారీ వరదలకు సైతం చెక్కు చెదరలేదు.
భూగర్భంలో అమర్చిన 10 మోటార్లపై ఒక్క నీటి చుక్క కూడా పడలేదు. అన్నారం పంప్‌హౌజ్ 13 లక్షల క్యుసెక్కులు, కన్నెపల్లి పంప్‌హౌజ్ 28 లక్షల క్యుసెక్కుల వరద తాకిడిని తట్టుకోలేక మునిగిపోయాయి. దేవాదుల పంప్‌హౌజ్ 29.50 లక్షల క్యుసెక్కుల వరద పోటును కూడా తట్టుకొని నిలబడింది. 15 ఏండ్లుగా దేవాదుల పంప్‌హౌజ్ మోటార్లు పనిచేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మోటార్లు ఆన్ చేస్తే వాటర్ లిఫ్ట్ చేస్తాయి. కానీ కాల్వల నిర్మాణం పూర్తికాకపోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు.