ఇండియా కూటమి వీక్​గా ఉంది.. నిజంగా బలంగా ఉంటే సంతోషమే..: చిదంబరం

ఇండియా కూటమి వీక్​గా ఉంది.. నిజంగా బలంగా ఉంటే సంతోషమే..: చిదంబరం
  • పుస్తకావిష్కరణలో ఇండియా కూటమిపై ఎంపీ కామెంట్​

న్యూఢిల్లీ: ఇండియా బ్లాక్ కూటమి భవిష్యత్తు అంత బాగా లేదని, బలంగా ఉంటే మాత్రం చాలా సంతోషమని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. ఈమేరకు శుక్రవారం ఢిల్లీలో సల్మాన్ ఖుర్షీద్ రచించిన ‘కంటెస్టింగ్ డెమోక్రటిక్  డెఫిసిట్: యాన్ ఇన్ సైడ్​ స్టోరీ ఆఫ్ ​ది 2024 ఎలక్షన్స్’ పుస్తకావిష్కరణ సభలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సభలో చిదంబరం మాట్లాడుతూ.. ‘‘నాకున్న ఎక్స్​పీరియన్స్, చరిత్ర ఆధారంగా ఓ మాట చెప్తున్న. బీజేపీ చాలా బలమైన పార్టీ. సంస్థాగతంగానూ శక్తిమంతమైన పార్టీ. 

ఇది కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదు.. ఒక యంత్రాంగం వెనుక ఉన్న మరో యంత్రాంగం’’ అని చిదంబరం అన్నారు. సల్మాన్ ఖుర్షీద్, మృతుంజయ్ సింగ్ యాదవ్ రాసిన ‘కంటెస్టింగ్ డెమోక్రటిక్ డెఫిసిట్’ పుస్తకావిష్కరణలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ‘‘ఇండియా కూటమి ఐక్యత, భవిష్యత్తుపై నాకు చాలా సందేహాలు ఉన్నాయి. ఈ కూటమి ఇప్పటికీ బలంగా ఉందో.. లేదో.. అనే విషయంలో నాకు స్పష్టత లేదు. మృత్యుంజయ సింగ్ యాదవ్ మాత్రం ఇండియా కూటమి బలంగా ఉందని భావిస్తున్నారు. కానీ.. నాకు మాత్రం అలా అనిపించడం లేదు. 

కూటమి ఏర్పాటులో భాగమైన సల్మాన్ ఖుర్షీద్ మాత్రమే దీనికి సమాధానం చెప్పగలరు. ఒకవేళ కూటమి బలంగా ఉంటే.. నేను చాలా సంతోషిస్తాను. కానీ.. ఇప్పుడు కూటమికి బీటలు వారినట్లు కనిపిస్తున్నది’’ అని చిదంబరం అన్నారు. అదే బీజేపీ విషయానికొస్తే వ్యవస్థీకృతంగా చాలా బలంగా ఉందని చెప్పారు. ‘‘ప్రతి వ్యవస్థను నియంత్రించగల, స్వాధీనం చేసుకోగల శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉంది. ఎన్నికల కమిషన్ నుంచి లోకల్ పోలీస్ స్టేషన్ వరకు బీజేపీ మేనేజ్ చేయగలదు. 

బీజేపీని ఎదుర్కోవాలంటే ఇండియా కూటమి అన్ని విభాగాలను మెరుగుపరుచుకోవాలి. 2029 ఎన్నికలకు ఇది ఎంతో కీలకం. లేదంటే.. బీజేపీ మరింత బలపడుతుంది. ఆ తర్వాత ఆ పార్టీని మనం ఎదుర్కోలేం’’అని చిదంబరం అన్నారు.  కాగా, చిదంబరం కామెంట్లపై బీజేపీ నేతలు వ్యంగ్యంగా స్పందించారు. ‘‘కాంగ్రెస్ నేత చిదంబరం నిజాలు మాట్లాడారు. కాంగ్రెస్​తో పాటు ఇండియా  కూటమికి భవిష్యత్తులేదని తేల్చి చెప్పారు’’ అని బీజేపీ నేతలు అన్నారు.