ప్రధాని మోడీ లడఖ్ విజిట్ ఆశ్చర్యం కలిగించలేదు

ప్రధాని మోడీ లడఖ్ విజిట్ ఆశ్చర్యం కలిగించలేదు

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ 

పూణే: ఎల్‌వోసీ వెంబడి ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో రీసెంట్‌గా లడఖ్‌ను ప్రధాని మోడీ ఆకస్మికంగా పర్యటించిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్సీపీ అధినేత, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ స్పందించారు. మోడీ పర్యటన తనను ఆశ్చర్యానికి గురి చేయలేదని పవార్ చెప్పారు. 1962లో చైనాతో యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని జవహర్‌‌ లాల్ నెహ్రూ కూడా ఆ రీజియన్‌లో పర్యటించారని గుర్తు చేశారు. డ్రాగన్‌తో యుద్ధం టైమ్‌లో నెహ్రూ ఆ రీజియన్‌కు వెళ్లారని, అప్పుడు డిఫెన్స్ మినిస్టర్‌‌గా ఉన్న యశ్వంత్ రావ్ చవాన్ కూడా సరిహద్దుల దాకా వెళ్లి జవాన్లలో స్ఫూర్తి నింపారని పవార్ పేర్కొన్నారు.

‘ఎప్పుడైతే రెండు దేశాలు, వారి సైనికుల మధ్య వివాదాలు నెలకొంటాయో అప్పుడు ఆయా దేశాల నాయకులు తమ రక్షణ బలగాల్లో స్ఫూర్తి నింపాలి. 1993లో నేను డిఫెన్స్ మినిస్టర్‌‌గా ఉన్నప్పుడు చైనాకు వెళ్లా. ఇరు దేశాల సైనికులు వెనక్కి వెళ్లాలని అప్పుడు ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాం. అలాగే ఎలాంటి ఆయుధాలు వాడకూడదని కూడా ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రీసెంట్‌గా ప్రధానితో అఖిలపక్ష మీటింగ్‌ సమయంలోనూ వివాదాన్ని దౌత్యపరంగా పరిష్కరించాలని, అలాగే చైనాపై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పా. ఇండో–చైనాలు దౌత్యపరమైన చర్చలు నిర్వహించాయని, రెండు దేశాల సైన్యాలు వెనక్కి మళ్లాయని వార్తా పత్రికల ద్వారా తెలుసుకున్నా. ఇది నిజమైతే శుభ పరిణామమేనని చెప్పాలి’ అని పవార్ పేర్కొన్నారు.