సీఎం పదవి రానందుకు బాధలేదు: కన్నీళ్లు పెట్టుకున్న డిప్యూటీ సీఎం

సీఎం పదవి రానందుకు బాధలేదు: కన్నీళ్లు పెట్టుకున్న డిప్యూటీ సీఎం

15 నెలల పదవీకాలం ఉండగానే గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ సడన్‌గా రాజీనామా చేయడంతో ఆ రాష్ట్రానికి చెందిన పలువురు బీజేపీ సీనియర్ నేతలు సీఎం కుర్చీపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర పటేల్‌ను కేంద్ర నాయకత్వం ఎంపిక చేయడంతో ఆశావహులుగా ఉన్న నేతలు షాక్‌ అయ్యారు. అయితే సీఎం రేసులో ప్రధానంగా వినిపించిన పేరు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న నతిన్‌ పటేల్‌దే. కానీ ఆయనకు అవకాశం దక్కలేదు. దీనిపై ఆయన సోమవారం స్పందించారు. కన్నీళ్లు పెట్టుకుంటూ బీజేపీ తనకు ఎంతో చేసిందని, సీఎం పదవి రాలేదన్న బాధ లేదని నవీన్ పటేల్ చెప్పారు. 

18 ఏండ్ల వయసు నుంచి బీజేపీలో పని చేస్తున్నా..

ఈ రోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో భూపేంద్ర పటేల్‌ ఉదయం నితిన్‌ పటేల్‌ను కలిశారు. ఈ సందర్భంగా భూపేంద్రకు నితిన్ అభినందనలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భూపేంద్ర పటేల్‌ తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని, ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుండడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అవసరమైనప్పుడు ఆయన తన గైడెన్స్ తీసుకునేవారని చెప్పారు. తనకు అవకాశం రాకపోవడంపై బాధలేదని, తాను 18 ఏండ్ల వయసు నుంచి బీజేపీలో పని చేస్తున్నానని తెలిపారు. తనకు పార్టీ ఎటువంటి పదవులు ఇచ్చినా, ఇవ్వకపోయినా బీజేపీలోనే కొనసాగుతానని నితిన్ పటేల్‌ చెప్పారు. గడిచిన 30 ఏండ్లలో పార్టీ చాలా చేసిందని, ఇప్పుడు తనకు ఎటువంటి బాధ లేదని అన్నారు. ఇలా ఆయన మాట్లాడుతుండగా కంట నీరు ఆపుకోలేకపోయారు.