- సోషల్ మీడియాలో థంబ్‌నెయిల్ ఒకటి.. కంటెంట్‌లో మరోటి
- మీడియా రంగంలో ‘ప్రేక్షకుడే బాస్’ అని వ్యాఖ్య
- సౌత్ వ్యూయర్‌షిప్‌ను తొక్కిపెడుతున్నరు
- 10 నుంచి ‘కట్ ద అల్గో’ ఉద్యమం
- వెంటిలేటర్‌పై ప్రింట్ మీడియా
- రిపబ్లిక్ నెట్‌వర్క్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్
హైదరాబాద్, వెలుగు: మీడియా సంస్థలు కేవలం వ్యూస్, లైకులు, వైరల్ కావడం కోసమే కంటెంట్‌ను రూపొందించే ధోరణిని వీడాలని రాష్ట్ర శక్తి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. సమాజానికి, ప్రజలకు ఉపయోగపడే వాస్తవ సమాచారాన్ని అందించడమే బాధ్యతాయుత జర్నలిజం లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛ కీలకమే అయినా అదే స్థాయిలో బాధ్యతగా ఉండాలన్నారు. సోమాజిగూడలోని పార్క్ హోటల్‌లో సోమవారం ‘వీ6 న్యూస్, వెలుగు’ ఆధ్వర్యంలో ఫోర్త్ డైమెన్షన్ భాగస్వామ్యంతో నిర్వహించిన ‘సౌత్ ఇండియా మీడియా సమిట్–2026’ను మంత్రి వివేక్ ప్రారంభించారు.
వరుసగా ఏడో ఏడాది ఈ సదస్సును నిర్వహించారు. మీడియా భవిష్యత్తు, ఏఐ , ఓటీటీ, డిజిటల్ ట్రెండ్స్, మీడియా ఎదుర్కొంటున్న సవాళ్లపై సమిట్‌లో అడ్వర్టైజింగ్, టెక్నాలజీ, మీడియా రంగాల ప్రముఖులు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా విపరీతంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలకు నాణ్యమైన, విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన సమాచారాన్ని అందించాల్సిన అవసరం గతంలో కన్నా ఇప్పుడు ఇంకా పెరిగిందని తెలిపారు.
సోషల్ మీడియా కంటెంట్‌కు బాధ్యత ఎవరిది?
ఒకప్పుడు ప్రజలు వార్తల కోసం పత్రికలమీద, టీవీల మీద ఆధారపడేవారని, ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం వేగంగా పెరిగిందని మంత్రి వివేక్ అన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు చట్టపరమైన నియంత్రణలు, పరువు నష్టం చట్టాల లాంటి పరిమితులు ఉంటాయని, సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్‌కు బాధ్యత ఎవరిదనే ప్రశ్న తలెత్తుతోందని పేర్కొన్నారు.
థంబ్‌నెయిల్‌లో ఉన్నదానికి, కంటెంట్‌కు సంబంధం లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ట్రెండ్స్ పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలు దేన్నీ గుడ్డిగా నమ్మకుండా, వాస్తవాలను గుర్తించాలని సూచించారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలగకుండానే, తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టేలా ప్రభుత్వాలు, మీడియా సంస్థలు, జర్నలిస్టులు కలిసి నియంత్రణ విధానాన్ని రూపొందించుకోవాలని సూచించారు.
లోకల్ కంటెంట్‌కే ఆదరణ..
రాబోయే రోజుల్లో లోకల్ కంటెంట్ అత్యంత కీలక పాత్ర పోషించనుందని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మీడియా ఒకే ప్రాంతం నుంచి నియంత్రణకు గురైందని, స్థానిక ఉద్యమ ఆకాంక్షలు ప్రజల్లోకి సరిగ్గా వెళ్లలేదని గుర్తుచేశారు. ఆ తర్వాత తెలంగాణ నుంచి కొత్త మీడియా సంస్థలు ఆవిర్భవించాకే ఉద్యమ తీవ్రత, వాస్తవ దృక్కోణాలు ప్రజలకు చేరాయన్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తమ ప్రాంత సమస్యలు, స్థానిక పరిణామాలకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని, స్థానికంగా పనిచేసే మీడియా నెట్‌వర్క్‌లకే ప్రేక్షకాదరణ దక్కుతోందని అన్నారు. మీడియా రంగంలో అంతిమంగా ‘ప్రేక్షకుడే బాస్’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
ప్రేక్షకుల ఆదరణ ఉంటేనే మీడియా సంస్థలకు ప్రకటనల ఆదాయం వస్తుందని, తద్వారా సంస్థలు మనుగడ సాగిస్తాయని తెలిపారు. గతంలో 5 నిమిషాల వార్తా కథనాన్నైనా ప్రేక్షకుడు ఓపికగా చూసేవాడని, ఇప్పుడు మారిన జీవనశైలి కారణంగా ఒకటి లేదా రెండు నిమిషాల్లోనే సమాచారాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాడన్నారు. ఇందుకు తగ్గట్టుగా తక్కువ సమయంలోనే ప్రధాన అంశాన్ని, వాస్తవాన్ని, సందర్భాన్ని స్పష్టంగా అందించే నైపుణ్యాన్ని మీడియా అలవర్చుకోవాలని సూచించారు.
ఏఐ విజ్ఞానం పెంచొచ్చు.. కానీ స్వయంగా ఆలోచించాలి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధునిక సాంకేతికత సమాచార సేకరణ, విశ్లేషణలో కొత్త అవకాశాలు తెస్తున్నప్పటికీ.. విశ్వసనీయతకు ప్రాధాన్యమివ్వాలని మంత్రి వివేక్ హితవు పలికారు. తాను కూడా వివిధ సందర్భాల్లో సమాచారం కోసం చాట్‌జీపీటీని పరిశీలిస్తానని చెప్పారు. అయితే ఆ సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకొని విచక్షణతో వాడాలన్నారు. ఇంటర్నెట్ సమాచారంతో కొందరు పేషెంట్లు నేరుగా వైద్యులనే ప్రశ్నించే పరిస్థితులు వస్తున్నాయని, ఆన్‌లైన్ సమాచారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోతే ప్రమాదమని అన్నారు.
వెంటిలేటర్‌పైకి ప్రింట్ మీడియా
దేశంలో బడా కార్పొరేట్ సంస్థల ఆధీనంలో ఉన్న ప్రింట్ మీడియా ఎప్పుడో వెంటిలేటర్‌పైకి వెళ్లిపోయిందని, వారు వాస్తవాలను దాచిపెడుతూ రీడర్‌షిప్ సర్వేలతో ఇంకా బతికే ఉన్నట్టు భ్రమింపజేస్తున్నారని అర్నాబ్ అన్నారు. 2019 లోనే తాను ప్రింట్ మీడియా పతనాన్ని ఊహించానని, కరోనా మహమ్మారి ఆ రంగానికి తొలి ‘బ్లాక్ స్వాన్’ కాగా, ఇప్పుడు దూసుకొస్తున్న ఏఐ దాని శవపేటికపై చివరి మేకు కాబోతోందని చెప్పారు. విద్వేషాన్ని రెచ్చగొట్టే, అల్గారిథంలను వైరల్ చేసే కంటెంట్‌కు అమెరికన్ ప్లాట్‌ఫామ్‌లు పెద్దపీట వేస్తున్నాయని మండిపడ్డారు.
ఈ వివక్షకు చరమగీతం పాడేందుకు అక్టోబర్ 10 నుంచి దేశవ్యాప్తంగా ‘కట్ ద అల్గో’ పేరిట భారీ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. తాము సొంతంగా సీడీఎన్ , సాంకేతిక నెట్‌వర్క్‌ను నిర్మించుకొని మధ్యవర్తులు లేకుండా నేరుగా సీటీవీ, డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా ప్రజల్లోకి వెళ్తామన్నారు. ‘‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఒక సాధనం మాత్రమే.. దేశానికి జాతీయవాదమే ప్రాథమిక పునాది’’ అని అర్నాబ్ పేర్కొన్నారు. సాంకేతికత ఎంత పెరిగినా దేశం పట్ల ప్రజల్లో ఉండే భావోద్వేగాన్ని, ‘నేషన్ ఫస్ట్’ సిద్ధాంతాన్ని ఏఐ టూల్స్ రీప్లేస్ చేయలేవని వ్యాఖ్యానించారు.
సౌత్ వ్యూయర్‌షిప్‌ను కావాలనే తొక్కిపెడుతున్నరు: అర్నాబ్ గోస్వామి
దేశీయ మీడియా రంగం, రేటింగ్ ఏజెన్సీల తీరుపై రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు, ఎడిటర్ -ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామి మాట్లాడారు. బార్క్, ఏబీసీ, ఐఆర్ఎస్‌లాంటి సంస్థలు దక్షిణాది రాష్ట్రాల టీవీ వ్యూయర్‌షిప్‌ను చాలా తక్కువ చేసి చూపిస్తున్నాయని, ఇది వ్యవస్థీకృతంగా జరుగుతున్న కుట్ర అని ఆయన ఆరోపించారు.
దేశంలో 140 కోట్ల జనాభా ఉంటే కేవలం 50 వేల నుంచి 70 వేల శాంపిల్ మీటర్లను పెట్టుకొని మొత్తం దేశ ప్రేక్షకుల నాడిని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. వాస్తవానికి డిజిటల్ ట్రాక్షన్, రిటర్న్ పాత్ డేటా (ఆర్పీడీ) లెక్కలను పరిశీలిస్తే అధికారికంగా చూపిస్తున్న దానికంటే దక్షిణాదిలో న్యూస్ వ్యూయర్‌షిప్ 5 నుంచి 6 రెట్లు అధికంగా ఉందన్నారు.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగాల్‌లాంటి రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు నిరంతరం వార్తలను ఫాలో అవుతుంటే.. ‘ఆపరేషన్ సింధూర్’లాంటి కీలక జాతీయ పరిణామాలు జరిగే సమయంలోనూ ప్రజలు హిందీ సీరియళ్లు, సినిమాలు మాత్రమే చూస్తున్నారని సర్వేల్లో చూపించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
ఈ తప్పుడు శాంప్లింగ్ విధానం వల్లే సౌత్ న్యూస్ చానళ్లకు ప్రకటనల రేట్లు దక్కకుండా తీవ్ర నష్టం జరుగుతోందని, ఈ వ్యవస్థ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టేందుకే త్వరలోనే ‘రిపబ్లిక్ తెలుగు’ న్యూస్ చానల్‌ను సైతం ప్రారంభిస్తున్నామని అర్నాబ్ ప్రకటించారు.
