
- ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ స్పష్టీకరణ
- ప్యానెల్ ముందు ట్విట్టర్ ప్రతినిధుల హాజరు
న్యూఢిల్లీ: ‘‘ఇండియాలో ట్విట్టర్ పాలసీ కాదు.. ఈ దేశ చట్టమే సుప్రీం. చట్టానికి కాకుండా మీ పాలసీకే కట్టుబడి ఉంటామంటే కుదరదు” అని ట్విట్టర్ కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తేల్చిచెప్పింది. రూల్స్ ను ఉల్లంఘించినందుకు ఫైన్ ఎందుకు వేయొద్దో చెప్పాలని ప్రశ్నించింది. శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆధ్వర్యంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు ట్విట్టర్ ఇండియా ప్రతినిధులు, కేంద్ర సమాచార శాఖ అధికారులు హాజరయ్యారు. సోషల్ మీడియా దుర్వినియోగం కాకుండా నివారించడంపై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ ట్విట్టర్ ఇండియా, సమాచార శాఖ అధికారుల స్టేట్ మెంట్ తీసుకుంది. ట్విట్టర్ దుర్వినియోగం, ప్రజల హక్కులకు రక్షణ విషయంపై ట్విట్టర్ ఇండియా పబ్లిక్ పాలసీ మేనేజర్ షగుఫ్తా కమ్రాన్, లీగల్ కౌన్సెల్ ఆయుషి కపూర్, కేంద్ర అధికారులు కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. కాగా, కొత్త ఐటీ రూల్స్ విషయంలో కొన్ని రోజులుగా కేంద్రం, ట్విట్టర్ మధ్య వివాదం కొనసాగుతోంది. కొత్త ఐటీ రూల్స్ ను అమలు చేయడంలో ట్విట్టర్ ఫెయిల్ అయిందని, పలు చాన్స్ లు ఇచ్చినా ఆ సంస్థ రూల్స్ ను ఫాలో కానందున దానికి ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పించే లీగల్ ప్రొటెక్షన్ (మధ్యవర్తి హోదా)ను తొలగిస్తున్నామని కేంద్రం ఇదివరకే ప్రకటించింది. ఇప్పటికే కాంగ్రెస్ టూల్ కిట్ కేసులో ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరిని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు.
ట్విట్టర్ ఇండియా ఎండీకి నోటీస్
యూపీలోని ఘజియాబాద్ లో ఓ ముస్లిం వ్యక్తిపై దాడికి సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలంటూ ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరికి పోలీసులు నోటీస్ పంపారు. ఏడురోజుల్లోగా లోని బార్డర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి స్టేట్ మెంట్ ఇవ్వాలని నోటీస్ లో పేర్కొన్నారు. పోయిన నెలలో ఘజియాబాద్ లో ముగ్గురు వ్యక్తులు జైశ్రీరాం, వందేమాతరం అనాలంటూ తనపై దాడి చేశారంటూ ఓ ముస్లిం వ్యక్తి ఆరోపించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ అయింది. అయితే తాయెత్తు విషయంలో గొడవ పడినందుకే వారిపై తప్పుడు ఆరోపణలు చేసినట్లు పోలీసులు తేల్చారు. దీనిపై మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అయినా ఆ వీడియోను ట్విట్టర్ తొలగించకపోవడంతో ట్విట్టర్ తో పాటు ఓ న్యూస్ చానెల్, మరికొందరు వ్యక్తులపై కేసు పెట్టారు. ఈ కేసులో సీఆర్పీసీ సెక్షన్ 166 ప్రకారం విచారణకు రావాలంటూ నోటీసు ఇచ్చినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు.