
- స్ట్రక్చర్స్లేని భూముల రైతులకే నోటీసులు
- వివరాలు నమోదయ్యాక పరిహారం జమ
యాదాద్రి, వెలుగు: ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నోటీసులు జారీ అయ్యాయి. భూములకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు జారీ చేసిన వారికి త్వరలోనే పరిహారం అందనుంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలో ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణం కానుంది. 164 కిలోమీటర్ల రోడ్డుకు అవసరమైన భూమిని సేకరించడానికి ఆయా జిల్లాల్లో 8 ‘కాలా’(కాంపిటెంట్ అథారిటీ ల్యాండ్ అక్విజిషన్)ను ఏర్పాటు చేసి అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోలను బాధ్యులుగా నియమించారు.
యాదాద్రి జిల్లాలో 59.33 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరగాల్సి ఉండగా, 1,795 ఎకరాలకు త్రీజీ నోటిఫికేషన్ జారీ చేశారు. తుర్కపల్లి ‘కాలా’ పరిధిలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో సేకరించే భూముల్లోని బోర్లు, బావులు, చెట్లు, కట్టడాలకు సంబంధించిన స్ట్రక్చర్ ఎంక్వైరీ ముగిసింది. భువనగిరి, చౌటుప్పల్ పరిధిలోని భూములకు సంబంధించిన రైతులు భూములు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. స్ట్రక్చర్ ఎంక్వైరీ కూడా చేయనీయలేదు.
తుర్కపల్లి పరిధిలోని రైతులకు నోటీసులు..
తుర్కపల్లి పరిధిలో సేకరించే 510 ఎకరాల్లో స్టక్చర్ ఎంక్వైరీతో పాటు వెరిఫికేషన్ కూడా ముగిసింది. ఇందులో ఇబ్రహీంపూర్, కోనాపూర్, దాతరుపల్లి, దత్తాయిపల్లి, మల్లాపూర్ తదితర గ్రామాల్లోని రైతులకు సంబంధించి 8 ఎకరాలు, ప్రభుత్వ పరిధిలోని 6 ఎకరాల్లో ఎలాంటి స్ట్రక్చర్లు లేవు, దీంతో ముందుగా ఎలాంటి స్ట్రక్చర్స్ లేని భూముల రైతులకు పరిహారం ఇవ్వాలని హైవే అధికారులు నిర్ణయించారు. దీంతో 8 ఎకరాలు కోల్పోతున్న 32 మంది రైతులకు నోటీసులు జారీ చేశారు.
ఈ నోటీసుల్లో రైతు కోల్పోతున్న భూ విస్తీర్ణం, చెల్లించే విలువను పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న రైతులకు నోటీసులు అందజేయగా, మిగలిన వారికి నోటీసులు ఇవ్వాల్సి ఉంది. నోటీసులు అందుకున్న రైతులు ఈసీ, పట్టాదారు పాస్‌బుక్స్, బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్, పాన్‌కార్డుతో పాటు మూడు ఫొటోలను ఈ నెలాఖరులోగా అందించాలి. అయితే గతంలో పాన్‌కార్డు తీసుకోలేదు. గతేడాది జనవరి నుంచి పాన్‌కార్డు తప్పనిసరి చేశారు. దీంతో పాన్ కార్డులు లేని రైతులు అప్లయ్ చేసుకుంటున్నారు. రైతుల నుంచి డ్యాక్యుమెంట్లు తీసుకున్న తరువాతఆ వివరాలను జిల్లా ఆఫీసర్లు భూమి రాశి పోర్టల్‌లో అప్లోడ్ చేయనున్నారు. ఆ తర్వాతే రైతుల అకౌంట్లలో పరిహారం జమ కానుంది.