స్పామ్​ కాల్స్​పై వాట్సాప్​​కు నోటీసు

స్పామ్​ కాల్స్​పై వాట్సాప్​​కు నోటీసు

న్యూఢిల్లీ: గుర్తు తెలియని అంతర్జాతీయ నంబర్ల నుంచి వాట్సాప్ స్పామ్ కాల్స్ రావడంపై ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఈ  కంపెనీకి ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసు పంపుతుందని తెలిపారు. యూజర్లకు తగిన సెక్యూరిటీ ఉండేలా చూడాల్సిన బాధ్యత డిజిటల్ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లపై ఉందని, వారికి ఇబ్బంది కలిగితే ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పారు. భారతదేశ వాట్సాప్ యూజర్లకు గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ నంబర్‌‌‌‌ల నుంచి స్పామ్ కాల్స్​ వస్తున్నాయి. వీటిలో ఎక్కువగా ఇండోనేషియా (62) వియత్నాం (84), మలేషియా (60), కెన్యా (254)  ఇథియోపియా (251) దేశాలకు చెందిన కంట్రీ కోడ్‌‌‌‌ల నుంచి వస్తున్నాయని పలువురు ట్విట్టర్‌‌‌‌లో పేర్కొన్నారు.

పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (పిఎఎఫ్‌‌‌‌ఐ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ,  ప్రీలోడెడ్ యాప్‌‌‌‌లకు ఎలాంటి అనుమతులు ఉండాలనే దానిపై ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తోందని ఆయన తెలిపారు. డిజిటల్ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లు కచ్చితంగా జవాబుదారీతనంతో వ్యవహరించాలని తాను పదేపదే చెప్పానని మంత్రి పేర్కొన్నారు. స్పామ్ సమస్యను  వాట్సాప్ ​​తప్పక పరిష్కరించాలని అన్నారు. ఫోన్ ఉపయోగంలో లేని సమయంలో వాట్సాప్ స్మార్ట్‌‌‌‌ఫోన్ వినియోగదారుల మైక్రోఫోన్‌‌‌‌ను యాక్సెస్ చేసిందనే ఆరోపణలను ప్రభుత్వం పరిశీలిస్తుందని చంద్రశేఖర్ వెల్లడించారు.