13వేల500 టీచర్ పోస్టులకు.. నోటిఫికేషన్ వెయ్యాలె

13వేల500 టీచర్  పోస్టులకు.. నోటిఫికేషన్ వెయ్యాలె
  • స్కూల్ ఎడ్యుకేషన్  డైరెక్టరేట్ వద్ద నిరుద్యోగుల ఆందోళన 
  • వందలాది మంది అరెస్టు.. గోషామహల్  పీఎస్​కు తరలింపు
  • సీఎం చెప్పిన లెక్కల ప్రకారం టీఆర్టీ వేయాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్  చెప్పిన లెక్కల ప్రకారం 13,500 టీచర్  పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్  చేస్తూ నిరుద్యోగులు స్కూల్ ఎడ్యుకేషన్  డైరెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. విద్యాశాఖ మంత్రి తప్పుడు లెక్కలు ఇచ్చారని వారు మండిపడ్డారు. డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి  వచ్చిన అభ్యర్థులు హైదరాబాద్​లోని డీఎస్ఈ ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు.
 ఆందోళనకారులను రవీంద్రభారతి, ఏజీ ఆఫీస్, బీఎస్ఎన్ఎల్ ఆఫీస్, లక్డికాపూల్ తదితర ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, అభ్యర్థులకు తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. పోలీసులు బలవంతంగా నిరుద్యోగులను అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. స్టేషన్​లోనూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం నాయకులు హరీశ్, శ్రీను, సాయి, లక్ష్మణ్ తదితరులు మాట్లాడారు. 
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 13,500 టీచర్  పోస్టులకు టీఆర్టీ వేస్తామని ప్రకటించారనీ, కానీ ఇప్పుడు 5 వేల పోస్టులతోనే డీఎస్సీ వేస్తామనడం ఏంటని ప్రశ్నించారు. ఈ పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే.. చాలా జిల్లాల్లో నామత్రంగా పోస్టులు ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరేండ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సర్కారు మొండిచేయి చూపడం సరికాదని, వెంటనే మొత్తం పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్  చేయాలని డిమాండ్ చేశారు.
 సర్కారు స్కూళ్లలో ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్, మ్యూజిక్ తదితర పోస్టులనూ భర్తీ చేయాలని కోరారు. సర్కారు పట్టించుకోకపోతే వారం రోజుల్లో మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అరెస్టు అయిన వారిలో అభ్యర్థుల సంఘం నాయకులు ఇర్ఫాన్, భాను, కవిత, కోటేశ్, స్వప్న, మౌనిక, శ్రీలత, మంజుల, మధుకర్ తదితరులు ఉన్నారు.