త్వరలోనే 15 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్​ : సీఎం రేవంత్‌‌రెడ్డి

త్వరలోనే 15 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్​ :  సీఎం రేవంత్‌‌రెడ్డి

 

  • ఆ తర్వాత టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్లూ వస్తయ్​: సీఎం
  • మేం ఉద్యోగాలిస్తుంటే కేసీఆర్​ ఫ్యామిలీకి కడుపు మంట
  • వాళ్లు కుళ్లుకున్నా, గుక్కపెట్టి ఏడ్చినా రిక్రూట్​మెంట్​ ఆగదు
  • హరీశ్​రావు పెట్టే శాపనార్థాలతో పోయేదేమీ లేదని వ్యాఖ్య
  • ఆరోగ్యశాఖలో త్వరలో మరో 5 వేల పోస్టుల భర్తీ: భట్టి
  • స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేత

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో యువతకు తాము ఉద్యోగాలు ఇస్తుంటే.. కేసీఆర్‌‌‌‌కు, ఆయన కుటుంబ సభ్యులకు కడుపు మండుతున్నదని సీఎం రేవంత్‌‌రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు నిరుద్యోగులను కేసీఆర్ కుటుంబం వంచించిందని మండిపడ్డారు. వాళ్లకు కడుపు మండినా రిక్రూట్​మెంట్​ ఆగదని.. ఏడాది తిరిగేలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.  ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన స్టాఫ్‌‌ నర్సుల​కు బుధవారం ఎల్బీ స్టేడియంలో సీఎం నియామక పత్రాలు అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఫామ్​హౌస్​లో  ఉన్నోళ్లకు కడుపు మండినా, వాళ్లు కుళ్లుకున్నా, గుక్కపెట్టి ఏడ్చినా ఉద్యోగాల భర్తీ ఆగదు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి చూపిస్తం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటం. ఇప్పుడు 7 వేల మందికి స్టాఫ్‌‌‌‌ నర్స్‌‌‌‌ ఉద్యోగాలు ఇచ్చినం. త్వరలో 15 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తం. ఆ తర్వాత టీఎస్‌‌‌‌పీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు రిలీజ్ అవుతయ్.​ఇప్పటికే టీఎస్‌‌‌‌పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసినం” అని తెలిపారు. 

హరీశ్​రావు..! నీ శాపాలతో పోయేదేమీ లేదు

ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్​రావు శాపనార్థాలు పెడ్తున్నారని, ఆయన శాపాలతో పోయేదేమీ లేదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘మేము ఒకేసారి 7 వేల మందికి నియామక పత్రాలు ఇస్తుంటే, ప్రభుత్వానికి హరీశ్‌‌‌‌రావు శాపనార్థాలు పెడుతున్నడు. ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతున్నడు. హరీశ్​రావు.. నీ శాపాలతో పోయేదేమీ లేదు. పొట్టోడ్ని పొడుగోడు కొడితే, పొడుగోడ్ని పోచమ్మ కొట్టిందట. మేము ఉద్యోగాలు ఇస్తుంటే.. అవాకులు, చవాకులు పేలుతున్నవు కదా. ఇక్కడ ఉన్న పేద ఆడబిడ్డల కండ్లలో ఉన్న ఆనందం ఒక్కసారి చూడు. మీ మామకు(కేసీఆర్‌‌‌‌‌‌‌‌) చూపించు. పేదోళ్ల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే, ఆడబిడ్డలను ఆదుకుంటే, ఆ సంతోషం ఎలా ఉంటదో ఇక్కడున్న వారి ఆనందాన్ని చూసి తెలుసుకో’’ అని హితవుపలికారు. ‘‘పేదోళ్ల బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తుంటే శాపనార్థాలు పెడుతున్న హరీశ్‌‌‌‌రావును కేసీఆర్​ పిలిచి గడ్డి పెట్టాలి” అని ఆయన అన్నారు. ఉద్యోగాలు పొందిన ఆడబిడ్డలను అభినందించకపోతే, ప్రతిపక్ష  పాత్ర పోషించడం కూడా దండగే అని ఆయన విమర్శించారు. 

వాళ్ల ఉద్యోగాలు ఊడినయ్​.. వీళ్లకు ఉద్యోగాలు వచ్చినయ్​

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరగడానికి నిరుద్యోగమే కారణమని, నిరుద్యోగులు ముందు వరుసలో ఉండి ఉద్యమాన్ని నడిపారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఈ క్రమంలో ఎంతో మంది అమరులయ్యారని, వారి ఆశయాల సాధనలో గత ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఉద్యోగాలు కావాలని అడిగిన నిరుద్యోగుల మీద, ఉద్యమకారుల మీద కేసులు పెట్టించారని, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు కుటుంబ సభ్యుల ఉద్యోగాల మీద ఉన్న శ్రద్ధ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంపై లేదని మండిపడ్డారు. ‘‘నిజామాబాద్‌‌‌‌లో ఎంపీగా తన బిడ్డ కవిత ఓడిపోతే బాధపడ్డ కేసీఆర్, ఆ వెంటనే ఎమ్మెల్సీగా ఆమెకు ఉద్యోగం కల్పించిండు. ముఖ్యమంత్రిగా తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించడంపై పెట్టిన ధ్యాస, ఆలోచనను పేద నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంపై పెట్టలేదు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కుటుంబ ఉద్యోగాలను ఊడగొడితేనే, మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ప్రజలు నిర్ణయించుకొని.. ఎన్నికల్లో తీర్పు ఇచ్చిన్రు. వాళ్లు అనుకున్నట్టే కేసీఆర్ కుటుంబ ఉద్యోగాలు ఊడినయ్​.. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నయ్​” అని సీఎం రేవంత్ అన్నారు.  ప్రజలు, నిరుద్యోగుల జీవితంలో సంతోషం నింపడానికి, వారి కండ్లలో ఆనందం చూడడానికి తాము రోజూ 16 నుంచి 18 గంటలు పనిచేస్తున్నామని, విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించేందుకు  శాయశక్తులా కష్టపడుతున్నామని చెప్పారు. ‘‘నిరుద్యోగ యువతకు ఈ వేదిక నుంచి నేను భరోసా ఇస్తున్నా. సంవత్సరం తిరిగేలోగా 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మాది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. తెలంగాణ ఇస్తానని 2004లో కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో సోనియా గాంధీ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అలాంటి మాట తప్పని పార్టీ, ప్రభుత్వం మాది” అని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. 

లీకులు, కేసుల సాకుల్లేవ్: దామోదర

తమ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌కు కట్టుబడి ఉంటామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. తామొచ్చి 2 నెలలే అయిందని, అప్పుడే కొంత మంది గాలి విమర్శలు చేస్తున్నారని బీఆర్​ఎస్ నేతలపై ఆయన మండిపడ్డారు. ఇలాంటి విమర్శలను పట్టించుకునేది లేదన్నారు. పేపర్‌‌‌‌‌‌‌‌ లీకులు, కోర్టుల కేసుల సాకుల్లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగాలు పొందిన నర్సులకు అభినందనలు తెలిపారు. మనిషి పుట్టినప్పటి నుంచి చివరి శ్వాస వరకూ నర్సులు తోడుంటారని, ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చే పేద ప్రజలకు సేవ చేయాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు.  నర్సులు తల్లి తర్వాత తల్లి లాంటి వారు అని మంత్రి కొండా సురేఖ అన్నారు. ‘‘డాక్టర్ చూసి వెళ్లిపోతే, పేషెంట్‌‌‌‌తో ఉంటూ సపర్యలు చేసేది నర్సులే.  పేషెంట్లపై కసురుకోకుండా, వారికి అవసరమైన సహాయం అందిస్తూ మంచిపేరు తెచ్చుకోవాలి” అని ఆమె సూచించారు. 

ఉద్యోగం పొందిన ప్రతిఒక్కరూ బాధ్యతగా తమ విధులు నిర్వహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్ సెంటర్లు కూడా పెడుతున్నామని ఆయన చెప్పారు. రేవంత్ నేతృత్వంలో తామంతా ఒక టీమ్‌‌‌‌గా పనిచేసి ప్రజల ఆశయాలను నెరవేరుస్తామన్నారు. రోగుల పట్ల సానుకూల వైఖరితో ఉండాలని ఉద్యోగాలు పొందిన నర్సులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ సూచించారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, సీఎం సలహాదారు వేం నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర 
వేణుగోపాల్‌‌‌‌రావు తదితరులు పాల్గొన్నారు. 

ఆరోగ్యశాఖలో మరో 5 వేల పోస్టుల భర్తీ: భట్టి

తమ ప్రభుత్వానికి ఇది చాలా సంతోషకరమైన రోజు అని, ఇంత మందికి ఉద్యోగాలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క​ అన్నారు. రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, ఆర్థిక వ్యవస్థ చిద్రమైందని తెలిసినా ఉద్యోగాల భర్తీ చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం భర్తీ చేసిన పోస్టులతో ప్రభుత్వంపై ఏడాదికి సుమారు రూ.600 కోట్ల భారం పడుతుందన్నారు. అయినా, ఉద్యోగాల భర్తీ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఆరోగ్యశాఖలోనే ఇంకో 5 వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతున్నదని ఆయన తెలిపారు.

నర్సులే డాటర్లు.. డాక్టర్లు

ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తూ తాము ఎంత సంతోషాన్ని పంచుకున్నామో, ఉద్యోగాలు పొందిన నర్సులు కూడా అదే స్థాయిలో సంతోషంగా గడపాలని, వారి సంతోషాన్ని తాము కూడా పంచుకోవాలనే ఉద్దేశంతోనే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏడాది నుంచి ఆగిపోయిన నర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను, అన్ని అడ్డంకులను తొలగించి నెల రోజుల వ్యవధిలోనే పూర్తి అయ్యేలా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కృషి చేశారని సీఎం అభినందించారు. ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆయన సూచించారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో నర్సులది కీలక పాత్ర అని, నర్సులే డాటర్లు, డాక్టర్లు అని పేర్కొన్నారు.