మెడికల్ కాలేజీల్లో .. 4,356 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

మెడికల్ కాలేజీల్లో .. 4,356 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ మెడికల్  కాలేజీల్లో ఖాళీగా ఉన్న 4,356 టీచింగ్  ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి మెడికల్  ఎడ్యుకేషన్  డిపార్ట్‌‌‌‌మెంట్   మంగళవారం నోటిఫికేషన్  ఇచ్చింది. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్  ప్రొఫెసర్, అసిస్టెంట్  ప్రొఫెసర్, ట్యూటర్, సీనియర్  రెసిడెంట్  పోస్టులు ఉన్నాయి. కాలేజీల వారీగా పోస్టుల వివరాలను ఆయా కాలేజీల వెబ్‌‌‌‌సైట్లలో పొందుపర్చారు. కాలేజీల వెబ్‌‌‌‌సైట్ల వివరాలు (https://dme.telangana.gov.in/) ఉన్నాయి. అన్ని కాలేజీల్లో ఈనెల 16న వాక్ ఇన్  ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. అర్హతలు ఉండి, నోటిఫికేషన్‌‌‌‌లో పేర్కొన్న సర్టిఫికెట్లను తీసుకుని అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.  

క్వాలిఫికేషన్‌‌‌‌లో వచ్చిన మార్కులు, అభ్యర్థుల అనుభవం, ఇతర అంశాల ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం  నోటిఫికేషన్‌‌‌‌లో ఇచ్చిన పోస్టుల్లో అధిక భాగం 2021 అక్టోబర్  నుంచి ఖాళీగా ఉన్నాయని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఓ  ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టుల భర్తీతో ప్రభుత్వంపై ఏటా రూ.634 కోట్ల 48 లక్షల భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఎన్‌‌‌‌ఎంసీ తనిఖీల్లో ప్రధానంగా ఆధార్  బేస్డ్  అటెండెన్స్  మానిటరింగ్ సమస్యను అధిగమించబోతున్నామని మంత్రి వెల్లడించారు.