ఎస్సై, కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టుల కోసం తేదీల ప్రకటన

ఎస్సై, కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టుల కోసం తేదీల ప్రకటన

తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు పోలీస్ నియామక బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిజికల్ టెస్టులపై కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 8 నుంచి దేవాదారుధ్య పరీక్షలు ప్రారంభం అవుతాయని ప్రకటించింది. మొత్తం 11 కేంద్రాల్లో ఈవెంట్స్ ఉంటాయని రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. 23 నుంచి 25 రోజుల్లో జనవరిలోపు ఈ ప్రాసెస్ పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు అడ్మిట్ కార్డులు  డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు సూచించింది. 

ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు కలిపి పీఎంటీ, పీఈటీల కోసం 2,37,862 మంది అభ్యర్థులు పార్ట్‌-2 దరఖాస్తును అందజేశారు. ఒక అభ్యర్థి రెండు పోస్టులకు దరఖాస్తు చేసినా.. దేహదారుఢ్య పరీక్ష ఒకేసారి నిర్వహించనున్నట్టు బోర్డు అధికారులు తెలిపారు. ఒకసారి తీసిన రీడింగ్‌లు అన్ని విభాగాల్లోని పోస్టులకు వర్తిస్తాయని చెప్పారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లో ఈవెంట్స్‌ నిర్వహిస్తారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. శారీరక సామర్ధ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డులను వెంట తెచ్చుకోవాలని, బయోమెట్రిక్ ద్వారా పరీక్షలకు అనుమతిస్తారని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. పార్ట్ 2 అప్లికేషన్, కమ్యూనిటీ సర్టిఫికేట్‭ను వెంట తెచ్చుకోవాలని అభ్యర్థులకు సూచించారు.