ఇప్పుడు చెడ్డవిగా అన్పించినా..

ఇప్పుడు చెడ్డవిగా అన్పించినా..
  • అగ్నిపథ్ స్కీంపై మోడీ పరోక్ష వ్యాఖ్యలు
  • సంస్కరణలతోనే కొత్త లక్ష్యాల వైపు అడుగులు
  • కర్ణాటకలో ప్రధాని పర్యటన
  • బెంగళూరు ‘బేస్’ క్యాంపస్ ప్రారంభించిన మోడీ

న్యూఢిల్లీ/బెంగళూరు: ఇయ్యాల కొన్ని నిర్ణయాలు చెడ్డవిగా కనిపించొచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ దేశ నిర్మాణంలో అవే సాయపడుతాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పరోక్షంగా అగ్నిపథ్‌‌ పథకాన్ని ఉద్దేశించి ఆయన ఈ కామెంట్లు చేశారు. రెండు రోజుల పర్యటన కోసం కర్నాటక వెళ్లిన ప్రధాని.. సోమవారం బెంగళూరులో జరిగిన సభలో మాట్లాడారు. ‘స్టార్టప్, ఇన్నోవేషన్‌‌ల దారిలో నడవడం అంత సులభం కాదు. ఈ మార్గంలో దేశాన్ని నడిపించడం కూడా అంత ఈజీ కాదు.

పలు నిర్ణయాలు, సంస్కరణలు తాత్కాలికంగా చెడ్డవిగా కనిపించవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ వాటి ప్రయోజనాలను దేశం అనుభవిస్తుంది’ అని ప్రధాని వివరించారు. 21వ శతాబ్దపు భారతదేశం.. ఉపాధి సృష్టికర్తలు, ఆవిష్కర్తలకు చెందినదని, వారే దేశానికి నిజమైన బలమని అన్నారు. ఎనిమిదేండ్లుగా ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోందని తెలిపారు. సంస్కరణలు మాత్రమే మనల్ని కొత్త లక్ష్యాల వైపు, కొత్త సంకల్పాల వైపు తీసుకెళ్తాయని అన్నారు. దశాబ్దాలుగా స్పేస్, డిఫెన్స్ సెక్టార్లు ప్రభుత్వ కంట్రోల్‌‌లో ఉన్నాయని, ఇప్పుడు వాటి తలుపులు తెరిచామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం సౌకర్యాలు కల్పించి, ప్రజల జీవితాల్లో జోక్యాన్ని తగ్గించుకుంటే దేశ యువత ఏంచేయగలరో బెంగళూరు చూపెట్టిందని ప్రధాని అన్నారు. బెంగళూరు.. దేశ యువతకు కలల నగరమని, ఎంట్రప్రెన్యూర్‌‌‌‌షిప్, ఇన్నొవేషన్, ప్రైవేటు, పబ్లిక్ సెక్టార్లను ఉపయోగించుకునే హక్కు వంటివి ఇందుకు ప్రధాన కారణమని చెప్పారు.

పలు ప్రాజెక్టులు ప్రారంభం..

యలహంక ఎయిర్‌‌‌‌ఫోర్స్ స్టేషన్‌‌కు చేరుకున్న ప్రధానికి గవర్నర్ థావర్‌‌‌‌చంద్ గెహ్లాట్, సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం యెడియూరప్ప తదితరులు స్వాగతం పలికారు. బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్(బేస్‌‌) క్యాంపస్‌‌ను ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కర్నాటకవ్యాప్తంగా ఐటీఐలను మార్చడం ద్వారా అభివృద్ధి చేసిన 150 టెక్నాలజీ హబ్‌‌లను కూడా ఆవిష్కరించారు. 280 కోట్లతో ఐఐఎస్‌‌సీలో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్‌‌(సీబీఆర్)ను ప్రధాని ప్రారంభించారు. బగ్చి పార్థసారథి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌‌కు పునాదిరాయి వేశారు.