ఫండ్ ఇస్తం.. ఖర్చు పెట్టుకుంటం.. టికెట్ ఇవ్వండి

ఫండ్ ఇస్తం.. ఖర్చు పెట్టుకుంటం.. టికెట్ ఇవ్వండి

హైదరాబాద్, వెలుగు :  ఎన్నికలకు టైం దగ్గర పడుతుండడంతో ఆశావాహులు టికెట్ ప్రయత్నాలను వేగవంతం చేశారు. సిట్టింగ్ లపై వ్యతిరేకత, కొన్ని సీట్లలో అభ్యర్థులను మారుస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో వ్యాపారులు, డాక్టర్లు, ప్రభుత్వ అధికారులు, రిటైర్డ్ అధికారులు, ఎన్ఆర్ఐలు తమ ప్రయత్నాలను స్పీడప్  చేస్తున్నారు. రాష్ర్టంలోని వివిధ జిల్లాల్లో సుమారు 15 మంది ఎన్ఆర్ఐలు టికెట్ ఇవ్వాలని ఆయా పార్టీల నేతలను కోరుతున్నారు. విదేశాల్లో స్థిరపడి దేశానికి వచ్చి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇందు కోసం తమ జిల్లా నేతలు, మంత్రుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీకి ఫండ్స్ ఇవ్వడంతో పాటు ఎన్నికల ఖర్చు కూడా తామే భరిస్తామని చెబుతుండడంతో ఎన్ఆర్ఐలకు టికెట్లు ఇచ్చేందుకు ఆయా పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. తమకు టికెట్  ఇస్తే గెలుస్తామని పార్టీ పెద్దలకు వారు చెబుతున్నారు. పార్టీ బలం ఉండి, బలమైన అభ్యర్థులు లేని స్థానాల్లో ఎన్ఆర్ఐలకు టికెట్లు ఇచ్చేందుకు పార్టీల నేతలు కూడా వారి పేర్లను పరిశీలిస్తున్నాయి. 

సేవా కార్యక్రమాలతో బిజీబిజీ

ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఎన్ఆర్ఐలు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతూ పబ్లిక్ ను ఆకర్షించే పనిలో ఉన్నారు. గత ఎన్నికల్లో సిట్టింగ్ లకే టికెట్లు ఇవ్వడం, కాంగ్రెస్, టీడీపీ పొత్తుతో పలువురు ఎన్ఆర్ఐలకు టికెట్లు దక్కలేదు. ఈసారి ఎలాగైనా పోటీ చేయాల్సిందే అని వారు ముందుకు వెళుతున్నారు. ఇందు కోసం తమ జిల్లాల మంత్రులు, సామాజికవర్గ నేతల బర్త్ డేలు,పెళ్లి రోజులు ఇలా వివిధ సందర్భాల్లో అన్నదానాలు, పండ్ల పంపిణీ వంటివి చేస్తున్నారు. అలాగే రక్తదాన శిబిరాలు నిర్వహించడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, యాడ్లు ఇవ్వడం వంటి కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

ప్రతిపక్ష నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నరు

అన్ని జిల్లాల్లో సిట్టింగ్  ఎమ్మెల్యేలు, ప్రతిపక్షాల నేతలకు దీటుగా ఎన్ఆర్ఐలు కార్యక్రమాలు చేపడుతూ తాము రేసులో ఉన్నామని చెబుతున్నారు. ప్రతిపక్ష నేతలు టికెట్ రేసులో ముందున్నా పదేళ్లుగా అధికారం లేకపోవడంతో కాంగ్రెస్ కు అభ్యర్థులపరంగా ఇబ్బందిగా ఉంది. ఆర్థికంగా నిధులు, ఎన్నికల ఖర్చుకు వెనుకాడేది లేదని ఎన్ఆర్ఐలు చెబుతున్నారు.  సేవా కార్యక్రమాల ద్వారా గ్రౌండ్ వర్క్ చేస్తూ సిట్టింగ్ లకు, ప్రతిపక్ష నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. అభ్యర్థులను మార్చాల్సి వస్తే  వారికి జాక్ పాట్ తగిలి నట్లే అని జిల్లాల్లో చర్చ జరుగుతున్నది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీ ఎన్ఆర్ఐల కోసం చూస్తున్నారు. ఇక్కడ అభ్యర్థులు ఉన్నా  బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే ఆర్థికంగా బలమైన అభ్యర్థులు కావాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు  వ్యాఖ్యానిస్తున్నారు.