బుమ్రా జాగ్రత్త..! న్యూజిలాండ్‌ను వణికించిన 18 ఏళ్ల యువ బ్యాటర్

బుమ్రా జాగ్రత్త..! న్యూజిలాండ్‌ను వణికించిన 18 ఏళ్ల యువ బ్యాటర్

పసికూన జట్లుగా భావించే అసోసియేట్ దేశాలు అంతకంతకూ మెరుగవుతున్నాయి. ఏమాత్రం అవకాశం దొరికినా.. అగ్రశ్రేణి జట్లుగా చలామణి అవుతున్న మేటి క్రికెట్ దేశాలకు ఓటమి రుచి చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్, స్కాట్లాండ్ పోరాటం మరవక ముందే.. మరో పసికూన జట్టు యూఏఈ అలాంటి ప్రదర్శన చేసింది. 

దుబాయ్ వేదికగా గురువారం న్యూజిలాండ్‌, యూఏఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు మంచి మజాను అందించింది. ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన తొలుత కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా.. లక్ష్య చేధనలో యూఏఈ 136 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. అయితే ఈ మ్యాచ్‌లో యూఏఈ యువ బ్యాటర్ ఆర్యాన్ష్ శర్మ పోరాటం అద్భుతమనే చెప్పాలి. మరో ఎండ్ నుంచి సహకారం పోయినా.. ఒంటిరిగానే కివీస్‌ను ఓడించినంత పనిచేశాడు. 

కెరీర్‌లో తొలి మ్యాచ్

18 ఏళ్ల వయసు.. కెరీర్‌లో తొలి మ్యాచ్. ఎంతటి ఆటగాడిలోనైనా కాసింత భయం కనపడుతుంది. కానీ ఆర్యాన్ష్ శర్మలో అదెక్కడా కనిపించలేదు. వచ్చిరాగానే కివీస్ బౌలర్లపై ఎదురుగాడికి దిగాడు. అనుభవజ్ఞుడైన ఆటగాడిలా బౌండరీల వర్షం కురిపించాడు. 43 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 60 పరుగులు చేశాడు. ఒకానొక సమయంలో మ్యాచ్ యూఏఈ చేతికి వచ్చినప్పటికీ.. అనుభవం లేకపోవడం వారిని ఒత్తిడిలోకి నెట్టింది. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలం కావడంతో యూఏఈని ఓటమి బాట పట్టించింది. ఈ మ్యాచ్‌లో కివీస్‌ కెప్టెన్‌ టిమ్ సౌథీ 5 వికెట్లతో చెలరేగాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 దుబాయ్‌ వేదికగా శనివారం జరగనుంది. 

బుమ్రా జాగ్రత్త..!

ఈ క్రమంలో ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టును అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఐర్లాండ్ యువ ఆటగాళ్లు లోర్కాన్ టక్కర్, హ్యారీ టెక్టర్ లను తక్కువ అంచనా వేయకూడదని సూచిస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్త వహించిన.. ఫలితం తారుమారుమవుతుందని గుర్తుచేస్తున్నారు. అభిమానుల మాటల్లో వాస్తవం లేకపోలేదు. స్వదేశంలో ఆడుతుండటం ఐర్లాండ్ కు కలిసొచ్చే అంశం. ఇండియా, ఐర్లాండ్ మధ్య డబ్లిన్ వేదికగా నేడు(ఆగష్టు 18) తొలి టీ20 జరగనుంది.