జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష.. ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లేముందు ఇవి తెలుసుకోండి

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష.. ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లేముందు ఇవి తెలుసుకోండి

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా JEE అడ్వాన్స్‌డ్ 2024 పరీక్షను ఆదివారం (26 మే) నిర్వహించనుంది. రెండు షిఫ్టుల్లో పరీక్ష జరగనుంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీలోని 26, తెలంగాణలోని 13 నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 3 గంటల వ్యవధి ఉంటుంది. అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరు కావాలి. మొదటి పేపర్‌ను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. రెండో పేపర్‌ను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.

ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా 2.50 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్ రాయనున్నారు. జేఈఈ మెయిన్స్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన వారికి మాత్రమే ఈ పరీక్షలో హాజరుకావడానికి అనుమతి ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కూడా ఉత్తీర్ణత సాధిస్తే ఐఐటీల్లో బీటెక్ సీట్లకు పోటీపడే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. 

అభ్యర్థులు ఇవి పాటించాలి. 

- పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డును పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి. ఒరిజినల్ ఫోటో కూడా తీసుకెళ్లాలి.
- ఆధార్ కార్డు, పాఠశాల/కళాశాల లేదా ఏదైనా విద్యాసంస్థ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్ వంటి వాటిని వెంట తీసుకెళ్లాలి.
- పెన్నులు, పెన్సిళ్లు, వాటర్ బాటిళ్లను లోపలికి అనుమతిస్తారు.
- అభ్యర్థులు పాకెట్స్ లేకుండా వదులుగా ఉన్న దుస్తులు మాత్రమే ధరించాలి.
- బంగారం లేదా ఇతర  ఆభరణాలు ధరించిన వారిని లోపలికి అనుమతించరు.
- కండువాలు, మఫ్లర్లు, స్టోల్స్, శాలువాలు, టోపీలు, రంగు గాజులు ధరించకూడదు.
- మొబైల్ ఫోన్లు, గడియారాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.