45వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఎన్టీపీసీ రామగుండం విద్యుత్ సంస్థ

45వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఎన్టీపీసీ రామగుండం విద్యుత్ సంస్థ

దక్షిణాది రాష్ట్రాలకు వెలుగులు ప్రకాశింపజేస్తున్న రామగుండం ఎన్టీపీసీ 45 ఏళ్లు పూర్తిచేసుకుంది. మహారత్నగా కీర్తిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న రామగుండం ఎన్టీపీసీ 45వ వసంతంలోకి అడుగుపెట్టింది. పెద్దపల్లి జిల్లాలో రెండు వందల మెగావాట్ల సామర్థ్యంతో 1978 నవంబర్ 14న అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ హయాంలో ప్రారంభమైంది. అలా స్టార్ట్ అయిన ఎన్టీపీసీ ఈ రోజు అంచెలంచెలుగా ఎదిగి ఏడు యూనిట్లకు విస్తరించింది. ఈ రోజు 2600 మెగావాట్ల సామర్థ్యంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. మహారత్నగా హోదాతో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.

నూతనంగా నిర్మించిన 1600 మెగావాట్ల  తెలంగాణ పవర్ ప్రాజెక్ట్ లో ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు.. రూ.450 కోట్లతో తేలియాడే 100మెగావాట్ల సౌరవిద్యుత్ కేంద్రం పనులు ప్రారంభించారు. దేశంలోనే ప్రథమ ఐఎస్ వో - 14001 సర్టిఫికెట్ పొందిన ఏకైక సంస్థగా ఖ్యాతి గడిచింది. ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియెంట్, గోల్డెన్ పికాక్ అవార్డులు పొందింది. దాంతో పాటు 2019 - 2020 నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు వరించింది. విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థగా కొనసాగుతూనే సామాజిక స్ఫూర్తి పథంలోనూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.