అమీర్ పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడ్తం: తలసాని

అమీర్ పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడ్తం: తలసాని

పద్మారావునగర్, వెలుగు: తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం నందమూరి తారక రామారావును ఎప్పటికీ మరువలేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన అమీర్ పేట డివిజన్ లోని ఎస్.ఆర్. నగర్ లో  కమ్మ వారి సేవా సమితి నిర్వహించిన కార్తీక వన భోజనాల కార్యక్రమంలో పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా పలువురు అమీర్ పేటలోని సత్యం థియేటర్ వద్ద ఎన్టీఆర్​విగ్రహం ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. వారి విజ్ఞప్తికి స్పందించిన తలసాని తప్పకుండా ఎన్టీఆర్​విగ్రహం పెడ్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఖండిస్తున్నట్లు వెల్లడించారు. అధికారంలో ఉన్నామని వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు  పూనుకోవడం సరికాదని తలసాని అన్నారు.  

వన భోజనాల కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన నిర్వహకులను మంత్రి  అభినందించారు. అందరూ ఒకేచోట కూర్చొని తినడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ నామన శేషుకుమారి, మధు సూధన్, రమేశ్, కిషోర్, టిల్లు, సాయి, బుచ్చిబాబు పాల్గొన్నారు.