
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం 'వార్ 2'. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. మొన్నటి వరకు 'వార్ 2' ప్రమోషన్స్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఇప్పుడు తన తదుపరి చిత్రం 'డ్రాగన్' పై దృష్టి పెట్టారు. షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ మూవీపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.
గత నెలలో ' డ్రాగన్ ' మూవీ షూటింగ్ కర్ణాటకలోని కుమ్టాలో ప్రారంభమైంది. ఆ పాంత్రంలో ఉన్న అందమైన కొంకణ్ కోస్తా తీరం బ్యాక్ డ్రాప్ లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ చేశారు. భారీగా ఫ్యాకర్టీ సెట్ ను కూడా నిర్మించారు అయితే అక్కడి వాతావరణ పరిస్థితులు షూటింగ్ కు అంతగా సహకరించకపోవడంతో మూవీ మేకర్స్ అవుట్ డోర్ షూటింగ్ ను వాయిదా వేశారు. దీంతో చిత్ర బృందం హైదరాబాద్ కు షిప్ట్ అయింది. రామోజీ ఫిలిం సిటీలో కొత్త సెట్స్ ను నిర్మించాలని నిర్ణయించుకుంది.
వాటిలో ముఖ్యమైనది హీరో ఇంటి సెట్. ఈ సెట్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు ఖర్చు చేస్తున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ ఇంటి సెట్‌ను కథకు తగ్గట్టుగా, ప్రతి చిన్న వివరాలు చూసుకుంటూ డిజైన్ చేస్తున్నారు. ఎంపిక చేసిన రంగులు, అలంకరణ వస్తువులు, ప్రత్యేకంగా రూపొందించిన వాల్ హ్యాంగింగ్స్‌తో ఈ సెట్ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
వినాయక చవితి పండుగ తర్వాత ఎన్టీఆర్ ఈ చిత్ర షూటింగ్‌లో మళ్లీ పాల్గొంటారని తెలుస్తోంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి హైదరాబాద్‌లో సుమారు నెల రోజుల పాటు జరగనుంది. ఈ షెడ్యూల్‌లో ప్రధానంగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో ఒక గొప్ప యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిపోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు