పాక్​ వెళుతున్న చైనా నౌకలో అణ్వాయుధ సామగ్రి

పాక్​ వెళుతున్న చైనా నౌకలో అణ్వాయుధ సామగ్రి

ముంబై: చైనా నుంచి పాకిస్తాన్​కు వెళ్తున్న నౌకను ముంబైలోని సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు హవ శేవా పోర్టు వద్ద అడ్డుకున్నారు. ఓడను తనిఖీ చేయగా న్యూక్లియర్, బాలిస్టిక్  మిసైల్  ప్రోగ్రాంలో వినియోగించే సరుకు బయట పడింది. అలాగే ఒక ఇటాలియన్  కంపెనీ తయారు చేసిన కంప్యూటర్  న్యూమరికల్  కంట్రోల్ (సీఎన్ సీ) మెషీన్ కూడా ఆ నౌకలో దొరికింది. సీఎంఏ సీజీఎం అట్టిలా అనే మర్చంట్  షిప్  జనవరి 23న చైనా నుంచి పాకిస్తాన్ కు వెళుతోందని, అందులో అనుమానాస్పద సరుకు ఉందని సమాచారం అందడంతో ముంబైలో భద్రతా సంస్థల అధికారులు ఓడను ఆపి తనిఖీ చేశారు. పాకిస్తాన్  అణు, మిసైల్  కార్యక్రమాల్లో వాడేందుకు ఆ సరుకును తరలించే ప్రయత్నం చేసి ఉండవచ్చని డిఫెన్స్  రీసెర్చ్ అండ్  డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్​డీఓ) అధికారులు తెలిపారు. సీఎన్ సీని కంప్యూటర్  సిస్టమ్ ద్వారా నియంత్రించవచ్చని, అది అత్యంత కచ్చితత్వంతో పనిచేస్తుందని చెప్పారు. తన న్యూక్లియర్  కార్యక్రమాల్లో నార్త్  కొరియా సీఎన్ సీ మెషీన్  వాడిందని వెల్లడించారు. 

పాకిస్తాన్  డిఫెన్స్ రీసర్చ్ అండ్  డెవలప్ మెంట్  ఆధ్వర్యంలోని డిఫెన్స్ సైన్స్ అండ్  టెక్నాలజీ ఆర్గనైజేషన్  కోసం ఆ సరుకును తరలించే ప్రయత్నం చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. చైనా నుంచి పాక్ కు వెళ్తున్న ఆ ఓడలో భారీగా అనుమానాస్పద సరుకు ఉందని పోర్టు అధికారులు అప్రమత్తం చేయడంతో ఓడను అడ్డుకుని సోదాలు చేశామన్నారు. దొరికిన సరుకు బరువు మొత్తం 22,180 కిలోలని చెప్పారు. తైయున్  మైనింగ్  ఇంపోర్ట్  అండ్  ఎక్స్ పోర్ట్  కంపెనీ లిమిటెడ్  ఆ సరుకును తరలించిందని, పాకిస్తాన్ లో కాస్మోస్  ఇంజినీరింగ్  పనుల కోసం ఆ కంపెనీ పనిచేస్తున్నదని వివరించారు.