నుహ్ హింస పెద్ద గేమ్ ప్లాన్.. ఎలాంటి ప్రణాళిక లేకుండా ఇది సాధ్యం కాదు

నుహ్ హింస పెద్ద గేమ్ ప్లాన్.. ఎలాంటి ప్రణాళిక లేకుండా ఇది సాధ్యం కాదు

హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ నుహ్ హింసపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘర్షణ వెనుక పెద్ద గేమ్ ప్లాన్ ఉందని ఆయన అన్నారు. ప్రజలు కర్రలతో దేవాలయాల పక్కన ఉన్న కొండలను ఎక్కారని, ఇదంతా కూడా ఎలాంటి ప్రణాళిక లేకుండా సాధ్యం కాదని చెప్పారు. ఈ హింసకు ముందు తూటాలు పేల్చారని, ఆయుధాలు అమర్చారని, ఇదంతా ఒక పథకంలో భాగమేనని హోంమంత్రి వ్యాఖ్యానించారు.

విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నంలో నుహ్‌లో చెలరేగిన ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక మతగురువు సహా ఆరుగురు మరణించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ కేసులో 102 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, ఇప్పటివరకు 200 మందికి పైగా అరెస్టు చేశామని చెప్పారు. “మొత్తం 102 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 202 మందిని అరెస్టు చేయగా, 80 మంది ముందస్తు నిర్బంధంలో ఉన్నారు. కాల్పుల ఘటనలు ముందస్తు ప్రణాళికతోనే జరిగాయి.పైకప్పులపై ఉన్న రాళ్లు సేకరించి కొండలపైకి వెళ్లి కాల్పులు జరిపినట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటనలో సమాచారం సేకరించి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నాం. మేము అవసరమైనప్పుడు, బుల్డోజర్లను కూడా వాడతాం. ఈ ఘటనకు సంబంధించి ఏదైనా ముందస్తు సమాచారం ఉన్నట్లయితే మేము దర్యాప్తు చేస్తాం ”అని విజ్ చెప్పారు.

'గేమ్ ప్లాన్'

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని, విచారణ పూర్తికాకుండా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయానికి రాదని కూడా మంత్రి అనిల్ విజ్ స్పష్టం చేశారు. “దీని వెనుక పెద్ద గేమ్ ప్లాన్ ఉంది. దేవాలయాల పక్కన కొండలు ఎక్కి, చేతుల్లో లాఠీలు పట్టుకుని, ఎంట్రీ పాయింట్ల వద్ద గుమిగూడారు. సరైన ప్రణాళిక లేకుండా ఇదంతా సాధ్యం కాదు. బుల్లెట్లు పేల్చారు, కొంతమంది ఆయుధాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా ఒక ప్రణాళికలో భాగమే. క్షుణ్ణంగా విచారణ జరగకుండా ముందస్తు నిర్ధారణకు రాలేం” అని ఆయన అన్నారు. పరిస్థితి చక్కబడిన తర్వాత ఇంటర్నెట్ సేవలను కూడా పునరుద్ధరిస్తామని విజ్ తెలిపారు.

హర్యానా ప్రభుత్వం ఇటీవలే నుహ్ జిల్లాలోని SKM ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. నుహ్ హింసాత్మక ఘటనపై కొద్ది రోజుల తర్వాత ప్రభుత్వం అధికారులపై చర్యలు తీసుకుంది. డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ పన్వార్‌ను బదిలీ చేసి, అతని స్థానంలో ధీరేంద్ర ఖడ్గతాను నియమించారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుహ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) వరుణ్ సింగ్లాను బదిలీ చేసింది. ఆయన్ను భివానీకి బదిలీ చేసిన ప్రభుత్వం..  అతని స్థానంలో నరేంద్ర బిజర్నియాను నియమించారు.