500 మంది సిబ్బందితో ..సైబర్ సెక్యూరిటీ బ్యూరో

500 మంది సిబ్బందితో ..సైబర్ సెక్యూరిటీ బ్యూరో

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో రోజురోజుకి సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. టెక్నాలజీని వాడుతూ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డైలీ 250 మంది సైబర్​మోసాల బారినపడుతున్నారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ అడ్డాగా 185 రకాల నేరాలు చేస్తూ సైబర్ నేరగాళ్లు రూ.కోట్లు కొట్టేస్తున్నారు. 2021 జూన్ 16 నుంచి ఈ ఏడాది మార్చి 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 73,909 కేసులు రిపోర్ట్ కాగా.. పోలీసులు17,899 ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లు నమోదు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాదిలో 8 ట్రిలియన్‌‌‌‌ డాలర్లు, 2025 నాటికి 10.5 ట్రిలియన్​డాలర్లు సైబర్ నేరగాళ్లు దోచేసే ప్రమాదం ఉందని రాష్ట్ర పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో 3వ వంతుగా భావిస్తున్నారు.

ఇలాంటి సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాలను అరికట్టేందుకు బంజారాహిల్స్‌‌‌‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో టీఎస్‌‌‌‌ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌‌‌‌సీఎస్​బీ)ను గత నెల 31న ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బ్యూరో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఎస్పీలుగా విశ్వజిత్ కంపాటి, రఘువీర్‌‌‌‌‌‌‌‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోసం 500 మంది సిబ్బందిని నియమించారు. బ్యూరో వివరాలను డైరెక్టర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 

ఈ నాలుగు కీలకం

సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో.. ‘సైబర్ క్రైమ్‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌, యాక్సిలేటరీ యూనిట్, సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్‌‌‌‌, అడ్మిన్ లాజిస్టిక్ బ్రాంచ్‌‌‌‌’ ఈ నాలుగు విభాగాలు కీలక ఆపరేషన్స్ నిర్వహిస్తాయి. సైబర్ క్రైమ్ బ్రాంచ్‌‌‌‌లో ‘ 1930’ నంబర్​తో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ 24 గంటలు పనిచేస్తుంది. సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాలకు గురైన బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు మొదట 5 మందితో ఈ కాల్ సెంటర్​ను ఏర్పాటు చేశారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సిబ్బంది సంఖ్యను 15కు పెంచారు. ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌కు ప్రతిరోజు 700కు పైగా కాల్స్ వస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. వీటిలో 60 శాతం కేస్​స్టేటస్​తెలుసుకునేందుకు వచ్చే కాల్స్ కాగా.. 40 శాతం కొత్తగా మోసపోయిన బాధితుల నుంచి వచ్చేవి ఉంటున్నాయి. ఈ కాల్స్​ను రిసీవ్​ చేసుకుంటున్న సిబ్బంది.. బాధితులు కోల్పోయిన డబ్బును ఫ్రీజ్ చేయడం, సైబర్ నేరగాళ్ల వాడిన బ్యాంక్ అకౌంట్లు, ఫోన్ నంబర్లను రికార్డ్ చేస్తారు.

తెలంగాణ సైబర్‌‌‌‌ క్రైమ్స్‌‌‌‌ కో ఆర్డినేషన్‌‌‌‌ సెంటర్‌‌‌‌(టీ4సీ) ద్వారా ఏడాది కాలంలో రూ.65 కోట్లు ఫ్రీజ్ చేసి బాధితులకు అందించారు. అయితే, ఈ టీ4సీ సెంటర్​ను కొత్తగా ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో విలీనం చేశారు.

23 రాష్ట్రాల పోలీసులతో కనెక్ట్ చేసే ‘ సై క్యాప్స్’

సై క్యాప్స్(సీవై– సీఏపీ) పేరుతో సైబర్​ క్రైమ్ అనాలసిస్ అండ్ ప్రొఫైలింగ్ సిస్టమ్​ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా 23 రాష్ట్రాల పోలీసులతో కోఆర్డినేట్ చేసుకుంటారు. ఆయా రాష్ట్రాల్లో పోలీసులకు ఇచ్చిన పాస్​వర్డ్స్, యూజర్ ఐడీ ద్వారా ఈ సై క్యాబ్స్​ వెబ్ సైట్​ను లాగిన్ అయ్యి యాక్సెస్ చేసుకునే అవకాశం కలిగించారు. దీంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్‌‌‌‌, గోవా..  ఈ ఐదు రాష్ట్రాలతో కలిసి తెలంగాణ సైబర్​ పోలీసులు  జాయింట్ సైబర్ క్రైమ్‌‌‌‌ కో ఆర్డినేషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌ పేరుతో  ఆపరేషన్స్ చేస్తున్నారు.ఈ  రాష్ట్రాల పోలీసులు సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్ డేటాను షేర్ చేసుకుంటారు.సైబర్ నేరాలు, నేరగాళ్ల డేటాబేస్‌‌‌‌, వాడుతున్న టెక్నాలజీ గురించి అవసరమైన సమాచారం తెలుసుకుంటారు.వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డిస్ట్రిక్ట్ సైబర్‌‌‌‌ కో ఆర్డినేట్ సెంటర్స్‌‌‌‌,సైబర్ క్రైమ్ పీఎస్‌‌‌‌ల నుంచి సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాల డేటాను సేకరిస్తుంటారు. ప్రతి రోజు రిపోర్ట్ అవుతున్న కేసులతో డేటాబేస్‌‌‌‌ను రూపొందిస్తుంటారు.

సైబర్ దాడులను గుర్తించేలా ఎస్​వోసీ

ప్రభుత్వం, ఐటీ, కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకింగ్ వ్యవస్థకు సవాల్​గా మారిన సైబర్ దాడులను అరికట్టేందుకు స్పెషల్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్(ఎస్​వోసీ)ను ఏర్పాటు చేశారు. 15 మంది సభ్యులతో సైబర్ దాడులను గుర్తించనున్నారు. హ్యాకర్లు ఎలాంటి మాల్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ వాడుతున్నారనే వివరాలను ఈ సెంటర్​లోని సిబ్బంది సేకరిస్తారు. దేశవ్యాప్తంగా జరిగే సైబర్ దాడులకు సంబంధించిన వివరాలతో కంపెనీల సీఈవోలకు  అలర్ట్స్ పంపిస్తుంటారు.సంబంధిత వ్యక్తులు,కంపెనీల నిర్వాహకులకు సైబర్ హ్యాకింగ్స్‌‌‌‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

దీనివల్ల సైబర్ దాడులను ముందుగానే గుర్తించి వాటిని డిటెక్ట్‌‌‌‌ చేస్తారు. సైబర్ దాడులు జరగకుండా తీసుకోవాల్సిన సైబర్ సెక్యూరిటీ సిస్టమ్​ను  ఏర్పాటు చేస్తుంటారు.ఇలాంటి సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాలను ట్రాక్ చేసేందుకు ప్రత్యేక టూల్స్‌‌‌‌,ఆపరేటింగ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌(ఓఎస్‌‌‌‌) క్రియేట్ చేశారు. వీటి ద్వారా సైబర్ క్రైమ్‌‌‌‌కు సంబంధించిన అన్ని వివరాలు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు అందుబాటులో ఉండనున్నాయి.