డిజిటల్ ​పేమెంట్లలోనే మోసాలు ఎక్కువ

డిజిటల్ ​పేమెంట్లలోనే మోసాలు ఎక్కువ
  • మోసాలబారిన పడిన మొత్తం రూ. 30,252 కోట్లు
  • కార్డు, ఇంటర్​నెట్​ ట్రాన్సాక్షన్లలో ఎక్కువ మోసాలు ప్రైవేటు బ్యాంకుల్లోనే
  • లోన్ల మోసాలలో ప్రభుత్వ బ్యాంకులే టాప్

ముంబై: బ్యాంకింగ్​ రంగంలో మోసాలు 2022–23 లో సంఖ్యాపరంగా 13,530 కి పెరిగినప్పటికీ మోసాలకు గురయిన మొత్తం మాత్రం సగం తగ్గి రూ. 30,252 కోట్లకు చేరింది. రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) యాన్యువల్​ రిపోర్టు ప్రకారం.. డిజిటల్​ పేమెంట్లు (కార్డులు, ఇంటర్​నెట్​) లోనే ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. లోన్లపరంగా చూస్తే  ప్రైవేటు బ్యాంకులలో మోసాల సంఖ్య పెరిగాయి. మరోవైపు మోసాల ద్వారా ఎక్కువ మొత్తాన్ని నష్టపోయింది మాత్రం 2022–23 లోనూ ప్రభుత్వ రంగ బ్యాంకులే. గత మూడేళ్లలో రూ. లక్షకి మించిన మోసాల డేటాను ఆర్​బీఐ ఉదహరించింది.

2021–22 లో మోసాలకు గురయిన మొత్తం 2020–21తో పోలిస్తే 55 శాతం తగ్గిపోయినట్లు పేర్కొంది. కార్డులు, ఇంటర్​నెట్​ బ్యాంకింగ్​ ద్వారా జరిగిన చిన్న లావాదేవీలలోనే ఎక్కువ సంఖ్యలో మోసాలు 2022–23 లో చోటు చేసుకున్నట్లు ఆర్​బీఐ వెల్లడించింది. ఈ లావాదేవీలు ఎక్కువగా ప్రైవేటు రంగంలోని బ్యాంకులకు చెందినవే ఉండగా, లోన్ల విషయంలో మాత్రం ఎక్కువ మోసాలు ప్రభుత్వ రంగ బ్యాంకులలోనే జరిగాయని వివరించింది. విలువపరంగా 2022–23 ఫైనాన్షియల్​ ఇయర్లో రిపోర్టయిన మోసాలలో 94.5 శాతం మోసాలు అంతకు ముందు ఫైనాన్షియల్​ ఇయర్లలో జరిగినవేనని పేర్కొంది.

2022–23 ఫైనాన్షియల్​ ఇయర్లో ప్రభుత్వ రంగ బ్యాంకులలో రూ. 21,125 కోట్ల విలువైన 3,405 మోసాలు జరిగాయని, ప్రైవేటు బ్యాంకులలో రూ. 8,727 కోట్ల విలువైన 8,932 కేసులు రికార్డయ్యాయని కూడా ఆర్​బీఐ యాన్యువల్​ రిపోర్టు తెలిపింది. డేటా ప్రకారం చూస్తే, మోసాలకు గురయిన మొత్తంలో 95 శాతం అంటే రూ. 28,792 కోట్లు లోన్లకు సంబంధించిన కేసులవేనని వివరించింది. బ్యాంకింగ్​ రంగంలో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలను తాము తీసుకుంటున్నట్లు ఆర్​బీఐ తెలిపింది.