
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో అనుకోని ఘటన జరిగింది. ఊహించని ఈ ఘటనలో ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చిన ఓ వృద్ధురాలు మృతి చెందటం విషాదాన్ని నింపింది. 2025, అక్టోబర్ 16వ తేదీ ఉదయం జరిగిన ఈ ఘటనతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
గోదావరిఖనికి చెందిన రాజేశ్వరి అనే 85 ఏళ్ల వృద్ధురాలు.. కుటుంబ సభ్యులతో కలిసి అంజనేయస్వామి దర్శనానికి కొండగట్టు వచ్చింది. స్వామికి తలనీలాలు సమర్పించాలని నిర్ణయించుకుని.. కొండపై ఉన్న కళ్యాణ కట్ట దగ్గరకు వెళ్లింది. వెంట్రుకలపై నీళ్లు చల్లుకోవటానికి వెళ్లిన సమయంలో.. ఆ పక్కనే ఉన్న కరెంట్ స్థంభాన్ని పట్టుకున్నది రాజేశ్వరి అనే వృద్ధురాలు. ఆ కరెంట్ స్థంభానికి విద్యుత్ రావటంతో షాక్ కు గురైంది. అక్కడే సృహతప్పి పడిపోయింది.
విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి.. జగిత్యాలలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు చెప్పారు డాక్టర్లు. స్వామి దర్శనానికి వచ్చి.. ఇలా కుటుంబ పెద్దను కోల్పోవటం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది.
కొండగట్టుపై కరెంట్ పోల్ కు తగిలి.. ముందు రోజే.. అంటే అక్టోబర్ 15వ తేదీ బుధవారం ఓ కోతి కూడా చనిపోయింది. అయినా ఆలయ అధికారులు, విద్యుత్ అధికారులు స్పందించలేదనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. నిత్యం భక్తుల రద్దీతో ఉండే కొండగట్టు ఆలయంపై కరెంట్ షాక్ తో ఓ వృద్ధురాలు చనిపోవటం కలకలం రేపుతుంది. వెంటనే కరెంట్ పోల్ ను సరి చేయాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు.