
- నందినగర్, సింగాడికుంటలో వైద్యాధికారుల సర్వే
- ఒకే కుటుంబంలోని నలుగురికి అస్వస్థత
- వాంతులు, విరేచనాలతో బాధపడుతూ హాస్పిటల్లో చేరిక
- రేష్మ మృతదేహాన్ని బయటికితీసి పోస్టుమార్టం నిర్వహించే అవకాశం!
- మోమోస్ అమ్మిన ఆరుగురిని అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు
- 110 ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
హైదరాబాద్‌సిటీ/పంజాగుట్ట, వెలుగు: బంజారాహిల్స్‌లోని నందినగర్, సింగాడికుంటలో మోమోస్ తిని అస్వస్థతకు గురైన వారి సంఖ్య 97కు చేరింది. శుక్రవారం మోమోస్ తిన్న రేష్మ బేగం.. ఆది వారం చికిత్స పొందుతూ చనిపోయింది. మరో 39 మంది అస్వస్థతకు గురై సిటీలోని వివిధ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి సోమ, మంగళవారం నందినగర్, సింగాడికుంట సర్వే నిర్వహించారు.
214 ఇండ్లను సందర్శించారు. మోమోస్ తినడంతో తామూ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు 57 మంది తెలిపారు. దీంతో బాధితుల సంఖ్య 97కు చేరింది. వీరిలో కొందరికి ఓపీలో ట్రీట్మెంట్ ఇప్పించి న వైద్య శాఖ అధికారులు.. మరికొందరిని దగ్గర్లోని హాస్పిటల్స్‌కు తరలించారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. స్వాతి ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఏడుగురిని, తన్వీర్ హాస్పిటల్లో ఆరుగురిని జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు మంగళవారం కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చింతల్‌బస్తీ నుంచే సిటీ అంతా సప్లై
మోమోస్ విక్రయించిన వారితో పాటు వాటిని తయారు చేసిన వాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వారిలో బిహార్‌కు చెందిన అర్మాన్, సాధిక్, రజిక్, అనిఫ్, ముఖ్రం, ఆలం ఉన్నారు. వీరంతా మూడేండ్ల కింద హైదరాబాద్ సిటీకి వచ్చి వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. 8 నెలల కింద ఖైరతాబాద్‌లోని చింతల్‌బస్తీకి మకాం మార్చి మోమోస్ తయారు చేయడం ప్రారంభించారు. వాటిని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు.
రేష్మబేగం కూతురికి నిలోఫర్‌లో చికిత్స
రేష్మబేగం మృతదేహానికి ఆమె కుటుంబ సభ్యులు ఆది వారం అంత్యక్రియలు పూర్తి చేశారు. మోమోస్ తినడం వల్లే చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. అప్పటికే మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. మోమోస్ తినడంవల్లే ఆమె చనిపోయిందా? లేక మరేఇతర కారణాలు ఏమైనా ఉన్నా యా? అని తెలుసుకునేందుకు డెడ్‌బాడీ బయటికి తీసి పోస్టుమార్టం చేయించాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.
పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే రేష్మ బేగం మృతికి కారణమేంటో కచ్చితంగా తెలుస్తదని బంజారాహిల్స్ ఏసీపీ సామల వెంకట్‌రెడ్డి తెలిపారు. కాగా, రేష్మ బేగం కూతురు కూడా అస్వస్థతకు గురికావడంతో ఆమెను నిలోఫర్ హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. బాధితులందరూ మోమోస్‌తో కలిపి మయోనీస్ తిన్నారు. దీంతో మయోనీస్‌లో కల్తీ జరిగిందా? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
పలు హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్
మోమోస్ తిన్న ఓ కుటుంబంలోని నలుగురు అస్వస్థత కు గురయ్యారు. బంజారాహిల్స్ రోడ్ నం.14 శ్రీ వెంకటేశ్వర కాలనీకి చెందిన భారతి, ప్రణీత, భరత్, ప్రీతమ్ శుక్రవారం కూరగాయల కోసం నందినగర్ సంతకు వెళ్లారు. అక్కడే మోమోస్ తిన్నారు. వీళ్లంతా శుక్రవారం రాత్రి వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. శనివారం శ్రీనగర్ కాలనీలోని తన్వీర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.
వీరితో పాటు బిహార్‌కు చెందిన మరో ఇద్దరు కూడా అదే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, అస్వస్థతకు గురైన 97 మంది వివిధ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతుండగా.. ఐదుగురు డిశ్చార్జ్ అయ్యారని హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి తెలిపారు.
ప్రస్తుతం రిలీఫ్ హాస్పిటల్లో ఆరుగురు, ఒవైసీ హాస్పిటల్లో ముగ్గురు, నిలోఫర్‌లో ఒకరు, స్వాతి హాస్పిటల్ లో తొమ్మిది మంది, తన్వీర్ హాస్పిటల్ లో ఆరుగురు, విజయమేరి హాస్పిటల్లో ఏడుగురు, అపోలో హాస్పిటల్ లో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
నిర్వాహకులకు ఫైన్లు..
మోమోస్ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జీహెచ్ఎం సీ అధికారులు.. మంగళవారం హైదరాబాద్ సిటీలోని పలు మోమోస్ తయారీ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై దాడులు చేశారు. 110 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. 69 శాంపిల్స్‌ను సేకరించి టెస్టుల కోసం ల్యాబ్‌కు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై జరిమానా విధించారు.
నిలకడగానే అందరి ఆరోగ్యం
మోమోస్ తిని పలువురు అస్వస్థతకు గురైన ట్టు తెలియగానే నందినగర్, సింగాడికుంట లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశాం. 57 మం ది అస్వస్థతకు గురైనట్లు గుర్తించిం వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నం. ఆయా హాస్పిటల్స్ చికిత్స పొందుతున్న 34 మంది వద్దకు మా వైద్యాధికారులు వెళ్లి హెల్త్ కండీషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నది.
- డాక్టర్ వెంకటి, హైదరాబాద్ డీఎంహెచ్‌వో