- ప్రియుడు పెండ్లికి నిరాకరించడంతో హోటల్ గదిలో సూసైడ్
గచ్చిబౌలి, వెలుగు : గచ్చిబౌలిలోని రెడ్‌స్టోన్ హోటల్లో ఈ నెల16న మృతి చెందిన నర్సు శ్రుతి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని పోలీసులు తేల్చారు. దీనికి ప్రేమ వ్యవహారమే కారణమని గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన గొల్ల శ్రుతి(23) నర్సింగ్ పూర్తి చేసింది. రెండేండ్ల కింద పాలమూరులో డ్రైవింగ్ నేర్చుకునే టైంలో డ్రైవింగ్స్కూలులో పనిచేసే జీవన్‌పాల్(26)తో ప్రేమలో పడింది. ఈ నెల 14న శృతి, జీవన్‌పాల్, వారి ఫ్రెండ్స్ మౌనిక, వెంకటేశ్ కలిసి గచ్చిబౌలికి వచ్చారు.
నిమజ్జనాలు చూసేందుకు వచ్చామని రెడ్‌స్టోన్ హోటల్లో రెండు రూమ్స్ తీసుకున్నారు. 15న రాత్రి నలుగురు కలిసి మద్యం తాగారు. తనను పెండ్లి చేసుకోవాలని శృతి..జీవన్పాల్ను అడిగింది. జీవన్ పాల్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అదే టైంలో జీవన్‌కు మరో ఇద్దరు యువతుల నుంచి కాల్స్ రావడంతో నిలదీసింది. మనస్తాపానికి గురై మరో గదికి వెళ్లి తలుపు వేసుకుంది. ఎంతసేపు డోర్ కొట్టినా తీయకపోవడంతో నిద్రపోయిందనుకుని జీవన్‌పాల్, మౌనిక, వెంకటేశ్ అర్ధరాత్రి సికింద్రాబాద్‌లో నిమజ్జనం చూసేందుకు వెళ్లారు.
తెల్లవారుజామున 3 గంటలకు హోటల్‌కు వచ్చి డోర్ కొడితే తీయకపోవడంతో సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వచ్చి మాస్టర్ కీతో ఓపెన్ చేయగా అప్పటికే శ్రుతి చనిపోయి సీలింగ్ఫ్యాన్ కు వేలాడుతూ ఉంది. తమ బిడ్డది ఆత్మహత్య కాదని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో శ్రుతిది ఆత్మహత్య అని తేలిందని పోలీసులు గురువారం వెల్లడించారు. జీవన్పాల్మీద కేసు ఫైల్చేసి, రిమాండుకు తరలించినట్లు చెప్పారు.