జాజికాయ, జాపత్రి, లవంగాలను ప్రపంచమంతా వాడుతోంది

జాజికాయ, జాపత్రి, లవంగాలను ప్రపంచమంతా వాడుతోంది

ప్రస్తుతం జాజికాయ, జాపత్రి, లవంగాలను ప్రపంచమంతా వాడుతోంది. కానీ, ఒకప్పుడు వీటిని ఇతర దేశాలకు రవాణా చేయాలంటే ప్రాణాల మీదకి వచ్చేది. అయితే, చరిత్ర తిరగేస్తే.. దాదాపు 6వ శతాబ్దం వరకు పశ్చిమ ప్రాంత ప్రజలకు వీటి గురించి తెలియదు. లవంగాలు, జాజికాయలను అరబ్​లు ఎక్కువగా వంటల్లో వాడతారు. నిజానికి ఈ మసాలాలు అక్కడి​ ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. యూరోపియన్ వంటల్లో కూడా వీటి వాడకం ఎక్కువగా ఉండేది. అయితే యూరోపియన్ దేశాలు చాలా దూరంగా ఉండడం వల్ల అక్కడ వీటి ధర చాలా ఎక్కువగా ఉండేది. ధనవంతులు మాత్రమే కొనగలిగేవాళ్లు. అయినప్పటికీ, దాదాపు12వ శతాబ్దంలో ఆసియా దేశ మసాలాలకు పాపులారిటీ పెరిగింది. మధ్యయుగకాలంలో యూరప్​లో కూడా వంటల్లో, మెడిసిన్​లో వాడడం పెరిగింది. ఈ మసాలా దినుసులను తినడం బాగా అలవాటైంది వాళ్లకు. కూరగాయలు, పండ్లు, మాంసం, సూప్​లు, స్వీట్స్, వైన్​లో కూడా వీటిని వాడేవాళ్లు.13వ శతాబ్దంలో సిరియన్, అండలూసియన్ ​కుక్​ బుక్స్​లో వీటి ప్రస్తావన గొప్పగా, ఎక్కువగా కనిపించేది. 

ఇది మెడిసిన్​ కూడా...

లవంగం గురించి మొదట చైనా సాహిత్యంలో కనిపించింది. వాళ్లు లవంగాన్ని ‘హి షొ హియాంగ్’ అని పిలిచేవాళ్లు. అంటే ‘పక్షి నాలుక’ అని అర్థం. అయితే దీన్ని మొదట మౌత్​ ఫ్రెష్​నర్​గా వాడారు. కోర్టులో ఆఫీసర్లు డిస్కషన్స్​కు ముందు వీటిని నోట్లో వేసుకునేవాళ్లట. అంతేకాకుండా దీన్ని వంటల్లో, మెడిసిన్​గా వాడేవాళ్లు. వాంతులు, డయేరియా, కలరా వంటివి నయం చేయడానికి దీన్ని వాడేవాళ్లు. మనదేశంలో దీన్ని వంటల్లో, ఆయుర్వేద మందుల తయారీల్లో వాడతారు. 

జాజికాయ, జాపత్రి

జాజికాయ మీద ఉండే ఎర్రని వల లాంటి లేయర్​నే జాపత్రి అంటారు. వీటి గురించి పురాతన హిందూమత గ్రంథాల్లో రాసి ఉంది. తలనొప్పి, నరాల సమస్య, జలుబు, జ్వరం, జీర్ణక్రియ సమస్యలు ఉన్నవాళ్లకు దీన్ని వాడమని చెప్పేవాళ్లు. ఆ తర్వాతికాలంలో ఆస్తమా, పంటి నొప్పి, రుమాటిజం, విరేచనాలు, గుండె సంబంధిత సమస్యలకు మెడిసిన్​గా పనిచేస్తుందని తెలిసింది. ఇవి కూడా మొదట చైనాకి వెళ్లి అక్కడి నుంచి మనదేశానికి వచ్చాయి. కానీ, జాజికాయ పుట్టింది మాత్రం ట్రాపికల్ ఐలాండ్స్ అయిన బాండాలోని లోయల్లో. ఈ ఐలాండ్స్ నుంచి బయటి ఐలాండ్​లకు ట్రేడింగ్ జరిగేది. ఇది సాగో పామ్​ (సాబుదానా లేదా సగ్గుబియ్యం) అనే ఫుడ్ ఐటమ్​ నుంచి మొదలైంది. సాగోతో వ్యాపారం చేసే నాయకులే సుగంధ ద్రవ్యాలను కూడా ట్రేడింగ్ చేయాలనుకున్నారు. 

ప్రపంచ వర్తకం

జాజికాయ, లవంగాలు.. మలయ్, ఇండోనేసియా నావికుల ద్వారా ప్రపంచానికి పరిచయమయ్యాయి. ఇండియా, శ్రీలంక నావికులు బంగాళాఖాతానికి వెళ్లాలంటే బాలి, జావా, సుమత్ర ప్రాంతాల ద్వారా ప్రయాణించాలి. ఇండోనేసియా నావికులు అతి పెద్ద ద్వీపసమూహం మధ్యలో ట్రేడింగ్​ చేసేవాళ్లు. అలా ఆగ్నేయాసియా, చైనాకు చేరుకున్నారు. ఆ తర్వాత జావా, సుమత్రాలో ట్రేడింగ్ ఎంపోరియంలు ఏర్పడ్డాయి. అక్కడ భారతీయ, అరేబియా నావికులు ఆగ్నేయాసియాలోని అన్ని సుగంధ ద్రవ్యాలు, వస్తువులను అమ్మొచ్చు. వాటిని హిందూ మహాసముద్రం అంతటా సరఫరా చేయొచ్చు. భారతీయ, అరేబియా నౌకలు మలక్కా జలసంధి వరకు తూర్పున మాత్రమే ప్రయాణించేవి. కానీ, ఇండోనేసియా నౌకలు మాత్రం తూర్పు ఇండోనేసియా, చైనాకు కూడా వెళ్లాయి. సుగంధ ద్రవ్యాలు, లవంగం, జాజికాయ, జాపత్రి పుట్టిల్లు అరేబియా, ఇండియా నావికులకు మధ్య యుగాల వరకు తెలియదు. అయితే, జాజికాయ, జాపత్రి రెండూ క్రీ.శ.1వ శతాబ్దంలోనే కనుగొన్నట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి. రోమన్ రచయిత ప్లినీ రెండు రుచులతో ఉన్న జాజికాయ, జాపత్రి చెట్టు గురించి రాశాడు. తరువాత, ఆరో చక్రవర్తి హెన్రీ తన పట్టాభిషేకానికి ముందు రోమ్ వీధులను జాజికాయల  సువాసనలతో నింపాడు. 6వ శతాబ్దంలో, జాజికాయలను అరబ్ వ్యాపారులు వీటిని కాన్‌‌స్టాంటినోపుల్‌‌కు తెచ్చారు. ఈ ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. మధ్యలో వీటి కోసం యుద్ధాలు జరిగాయి.

14వ శతాబ్దంలో అర కిలో జాజికాయ ధర మూడు గొర్రెలు లేదా ఒక ఆవుతో సమానం. అలా జాజికాయ ధర నానాటికీ పెరిగిపోయింది.1600 సంవత్సరంలో యుద్ధాలకు దారితీసింది. ఈస్ట్ ఇండియాలో జాజికాయ ఉత్పత్తిని కంట్రోల్​ చేయడం కోసం డచ్‌‌వాళ్లు బాండా ద్వీపంలోని ప్రజల్ని ఊచకోత కోశారు. బానిసలుగా మార్చారు. తరువాత, మన్‌‌హట్టన్ ద్వీపంపై చర్చల సమయంలో, బ్రిటిష్ వాళ్లు జాజికాయను ఉత్పత్తి చేసే ద్వీపంపై ఆధిపత్యం చేయాలనుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం వరకు సుగంధ ద్వీపాలపై ఆధిపత్యం చెలాయించారు డచ్​ వాళ్లు.

1760లో, లండన్‌‌లో జాజికాయ ధర ఒక పౌండ్‌‌కు 85 లేదా 90 షిల్లింగ్‌‌లుగా ఉండేది. దాంతో ఆమ్‌‌స్టర్‌‌డామ్‌‌లో డచ్‌‌లు జాజికాయల గిడ్డంగులను కాల్చివేశారు. ఆ తర్వాత ఫ్రెంచ్ బొటానిస్ట్ పియరీ పోయివ్రే జాజికాయ మొలకలను మారిషస్‌‌కు రవాణా చేశాడు. అవి అక్కడ పెరిగి పెద్దయ్యాయి. దాంతో డచ్ వాళ్ల ఆధిపత్యాన్ని తమ కంట్రోల్​లోకి తీసుకోవడానికి అది సాయపడింది. 

ఆ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జాజికాయ చెట్టును పెనాంగ్, సింగపూర్, ఇండియా, శ్రీలంక, వెస్ట్ ఇండీస్, గ్రెనడాకు తీసుకువచ్చింది. గ్రెనడాలో దీనిని జాతీయ జెండాపై ముద్రించారు.