ఫుడ్ టైమింగ్స్ : ఏ ఆహారం ఎన్ని గంటలకు తినాలి.. ఇలా చేస్తే మరింత ఎనర్జీ

ఫుడ్ టైమింగ్స్ : ఏ ఆహారం ఎన్ని గంటలకు తినాలి.. ఇలా చేస్తే మరింత ఎనర్జీ

రోజంతా కష్టపడతారు.. కానీ సరైన సమయానికి మాత్రం భోజనం చేయని వారు చాలా మందే ఉంటారు. పనిలో పడి తినాలన్న విషయమే మర్చిపోయే వాళ్లు ఇంకొంతమంది. కానీ అలా చేస్తే వ్యాధులను కొని తెచ్చుకున్నట్టేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి టైం దాటిపోయాక తిన్నా కూడా ఎలాంటి ఫలితమూ ఉండదని అంటున్నారు. కాబట్టి సరైన సమయంలో సరైన ఆరోగ్య అలవాట్లను పాటించాలని, మెరుగైన ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. కొన్ని సార్లు రోజూవారి ఆహారంలో పాలు, పెరుగు, తృణధాన్యాలు లాంటి ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకున్నప్పటికీ అనారోగ్యం పాలవడం చాలా మందికి సమస్యగా మారుతుంది. అవన్నీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చేవే అయినా తగిన సమయంలో తీసుకోకపోవడం వల్ల మంచి ఫలితాలను పక్కన పెడితే.. దాని వల్ల కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఏం తింటున్నాం అన్నది ఎంత ముఖ్యమో.. ఏ సమయానికి ఏం తినాలి అన్న విషయం కూడా చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ఆ విషయానికొస్తే..

పాలు

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, పుష్కలంగా పోషకాలు ఉన్న పాలు తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. అయితే ఈ పాలను ఏ సమయంలో తీసుకోవాలన్న విషయానికొస్తే.. ఉదయం 7నుంచి 9 మధ్య, నిద్రకు ముందు రాత్రి 9నుంచి 11గంటల ప్రాంతంలో తాగితే మంచి ఫలితాలుంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అరటి పండ్లు

అరటి పండును ఉదయం అల్పాహారంతో లేదా మధ్యాహ్న అల్పాహారంగా కూడా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండ్లను ఉదయం 7నుంచి 10గంటల మధ్య, మధ్యాహ్నం అయితే ఉ.10నుంచి 11గంటల మధ్య ప్రాంతంలో తీసుకోవాలి. ఎందుకంటే అరటి పండ్లు శక్తినివ్వడంతో పాటు జీర్ణక్రియలోనూ సహాయపడతాయి.

పెరుగు

పెరుగును భోజన సమయంలో అంటే మధ్యాహ్నం 12 నుంచి 2గంటలు లేదా 3 నుంచి 4గంటల ప్రాంతంలో తీసుకోవడం మంచింది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.

ఆపిల్

రోజుకో ఆపిల్ తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి, విటమిన్లు అందుతాయని డాక్టర్లు చెబుతుంటారు. కాబట్టి వీటిని రోజూ ఉ. 7 నుంచి 10 మధ్యలో, లేదా మధ్యాహ్నం  3నుంచి 5గంటల ప్రాంతంలో తీసుకోవడం ఉత్తమం. ఇందులో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇవి రిఫ్రెషింగ్ ఫీలింగ్ ను తీసుకువస్తాయి.

మిక్స్డ్ నట్స్

బాదం, జీడిపప్పు, ఆక్రోట్స్, పిస్తా వంటి మిక్స్డ్ నట్స్ ను మధ్యాహ్నం చిరుతండిగా తినవచ్చు. వీటిని 3నుంచి 4గంటల ప్రాంతంలో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఫైబర్ ఎప్పుడూ పొట్ట నిండుగా ఉంచేలా చేస్తుంది. దీని వల్ల బరువు కూడా తగ్గుతారు. అర్థరాత్రి మంచింగ్ సమయంలోనూ ఈ గింజలను తీసుకోవచ్చు.

అన్నం

అన్నం తినడానికి అనువైన సమయం మధ్యాహ్నం 12నుంచి 2గంటల మధ్య కాలం. లేదా సాయంత్రం 5 నుంచి 7 గంటలు. ఇందులో ఉండే కార్బోహైడ్రేడ్లు పగటి పూట ఎక్కువ శక్తిని అందిస్తుంది.

పప్పులు, బీన్స్

వీటిని లంచ్ టైంలో.. అంటే మధ్యాహ్నం 12 నుంచి 2గంటల మధ్య లేదా డిన్నర్ సమయంలో సాయంత్రం 6నుంచి 8గంటల మధ్య తీసుకోవాలి. వీటిలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటారు. ఇవి సమతుల్య ఆహారాన్ని అందిస్తాయి. రోజువారీ వంటకాల్లోనూ వీటిని విరివిగా ఉపయోగించవచ్చు.