కొలంబో: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషార.. ఐపీఎల్ కోసం న్యాయ పోరాటానికి దిగాడు. మెగా లీగ్‌లో ఆడేందుకు వీలుగా తనకు ఎన్‌వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) ఇచ్చేలా లంక బోర్డును ఆదేశించాలని కోరుతూ కొలంబో జిల్లా కోర్టులో పిటిషన్ వేశాడు. ఫిట్‌నెస్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడనే కారణంగా లంక బోర్డు తుషారాకు ఎన్‌వోసీ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే లంక బోర్డుతో తనకు ఉన్న సెంట్రల్ కాంట్రాక్ట్ మార్చి 31తో ముగిసిందని, దానిని పొడిగించుకునే ఉద్దేశం లేదని తుషార వెల్లడించాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్లు కూడా బోర్డుకు తెలియజేశానని చెప్పాడు. గతంలో ఇదే ఫిట్‌నెస్ ప్రమాణాలతో తనకు ఎన్‌వోసీ ఇచ్చిన బోర్డు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని క్రికెటర్ వాదించాడు. ఈ కేసు 9న విచారణకు రానుంది. గతేడాది తుషారాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ. 1.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 137 టీ20లు ఆడిన తుషారా 174 వికెట్లు తీశాడు. లంక తరఫున 30 టీ20లు ఆడాడు.
