మెట్రో కొత్త రూట్లపై సమీక్ష

మెట్రో కొత్త రూట్లపై సమీక్ష
  •     మెట్రోరైల్​ మాడిఫై రూట్ ​ప్రతిపాదనపై ఉన్నతాధికారులతో ఎన్వీఎస్​రెడ్డి  భేటీ

హైదరాబాద్,వెలుగు :  జంట నగరాల్లో  మెట్రో రైల్ ఫేజ్– 2  మాడీఫైడ్ రూట్ ప్రతిపాదనలపై మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇంజనీరింగ్, సంస్థ ఉన్నతాధికారులతో ఆదివారం మెట్రో భవన్ లో సమీక్షించారు. నాగోల్–- ఎల్‌బీ నగర్, - మైలార్‌దేవ్‌పల్లి–- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌  రూట్​లపై చర్చించారు. నాగోల్, -ఎల్‌బీ నగర్,- మైలార్‌దేవ్‌పల్లి-ఎయిర్‌పోర్ట్ లైన్‌లోని చాంద్రాయణగుట్ట వరకు ఎంజీబీఎస్ – -ఫలక్‌నుమా వరకు మరో ఒకటిన్నర  కిలోమీటర్లు పొడిగించడం, ఓల్డ్‌ సిటీకి ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ ఇంటర్‌చేంజ్  స్టేషన్‌గా చాంద్రాయణగుట్టను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై కూడా  చర్చించినట్టు తెలిపారు.

ఫేజ్–2 లో ఖర్చు తగ్గింపునకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా తక్కువ ఖర్చు తో మెట్రో నిర్మాణానికి  చేపట్టాల్సిన అంశాల సాధ్యాసాధ్యాలపైనా సమీక్షించారు. కొత్త రూట్లలో మెరుగైన సౌకర్యాలు, ప్రయాణికుల సంఖ్యను పెంచడానికి వివిధ మెట్రోల ఉత్తమ పద్ధతులు అమలు చేసేందుకు , ఫేజ్-1 పనితీరును స్టడీ చేయాలని ఎన్‌వీఎస్ రెడ్డి సీనియర్ ఇంజనీర్లు, కన్సల్టెంట్‌లను ఆదేశించారు. మెట్రో రైళ్లలో లగేజీ కోసం స్థలం మొదలైన వాటికి డీపీఆర్‌లో ప్రాధాన్యం  ఇవ్వాలని సూచించారు.