- మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
ఉప్పల్, వెలుగు: మహిళలకు అత్యంత గౌరవం, పెద్దపీట వేసే సంస్కృతి ఒక్క భారతదేశంలోనే ఉందని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఉప్పల్ రామంతపూర్‌లో ప్రగతి ఉమెన్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు గీత పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. రామాయణ, మహాభారత కాలం నుంచి స్త్రీకి అన్యాయం జరిగిన చోట పురోగతి ఉండదని చరిత్ర చెబుతోందని, సీతమ్మకు జరిగిన అన్యాయం వల్ల రావణ వధ, ద్రౌపది పరాభవం వల్ల కురుక్షేత్రం సంభవించాయని గుర్తు చేశారు.
ప్రతి మహిళ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, మాజీ కార్పొరేటర్ బండారు శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.
