రాష్ట్రంలో ఇంటికో బీరు.. వీధికో బార్ : ఎన్వీఎస్ఎస్

రాష్ట్రంలో ఇంటికో బీరు.. వీధికో బార్ : ఎన్వీఎస్ఎస్

న్యూఢిల్లీ,వెలుగు: బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రం మొత్తాన్ని మత్తులో  ముంచిందని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. ఇంటికో బీరు,  వీధికో బార్ ఓపెన్ చేసి మద్యంపై ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుందన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల బంధం విడదీయరానిదన్నారు. గల్లీలో, ఢిల్లీలో కలిసి నడవడమే ఈ పార్టీలకు తెలుసన్నారు.  బీఆర్ఎస్ ఎంపీలు కేకే, నామాలు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. గతంలో  కాంగ్రెస్, బీఆర్ఎస్ లు తెలంగాణలో కలిసి పోటీ చేశాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారాన్ని పంచుకున్నాయన్నారు. అందుకే సీఎల్పీ బీఆర్ఎస్ లో విలీనం అయితే రాహుల్ ఏం మాట్లాడలేదన్నారు. కవిత కేసులపై కాంగ్రెస్,  రేవంత్ కేసులపై బీఆర్ఎస్ నోరెత్తడం లేదన్నారు. కేటీఆర్ ఎన్నికల గురించి నీతి వ్యాఖ్యలు చెప్తుంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులపై చర్చించినట్లు ప్రభాకర్​ వెల్లడించారు.