Virat Kohli: గొప్పోడే.. కోహ్లీ రికార్డు సమం చేసిన బాబర్ అజామ్

Virat Kohli: గొప్పోడే.. కోహ్లీ రికార్డు సమం చేసిన బాబర్ అజామ్

న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్తాన్ జట్టుకు వరుస ఓటములు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ ఇరు జట్ల మధ్య మూడు టి20లు జరగ్గా.. అన్నింటా పాక్ ఓటమిపాలైంది. దీంతో 5 మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో మరో రెండు మిగిలివుండగానే 0-3 తేడాతో కోల్పయింది. ఇంతలా పాక్  పరాభవాల బాట పడుతున్నప్పటికీ ఆ జట్టు మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ఔరా అనిపిస్తున్నాడు.

ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ బాబర్ అజామ్ మూడు అర్ధ శతకాలు బాదాడు. 57(35), 66(43), 58(37).. ఈ సిరీస్‌లో అతని స్కోర్లవి. సహచర బ్యాటర్లు పరుగులు చేయడానికే అవస్థలు పడుతుంటే బాబర్ అలవోకగా హాఫ్ సెంచరీలు చేస్తున్నాడు. దీంతో అతడు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ టి20ల్లో ఒకే ప్రత్యర్థి జట్టుపై కోహ్లీ అత్యధికంగా ఎనిమిది సార్లు 50+ స్కోర్లు నమోదుచేయగా.. పాక్ మాజీ కెప్టెన్ దాన్ని సమం చేశాడు.

విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై 21 ఇన్నింగ్స్‌లలో 8 హాఫ్ సెంచరీలు చేయగా.., న్యూజిలాండ్‌పై బాబర్ 18 ఇన్నింగ్స్‌లలో 7 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు. బహుశా, జనవరి 19న న్యూజిలాండ్‌తో జరిగే తదుపరి టి20లో బాబర్‌ మరో హాఫ్ సెంచరీ చేస్తే.. కోహ్లీని మించిపోయే అవకాశం కూడా ఉంది.

అంతర్జాతీయ టి20ల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక 50+ స్కోర్లు

  • విరాట్ కోహ్లీ:  8 సార్లు (ఆస్ట్రేలియాపై)
  • బాబర్ ఆజం:  8 సార్లు (న్యూజిలాండ్ పై)
  • డేవిడ్ వార్నర్: 7 సార్లు (శ్రీలంకపై)
  • విరాట్ కోహ్లీ: 6 సార్లు (వెస్టిండీస్ పై)
  • మహ్మద్ రిజ్వాన్:  6 సార్లు (ఇంగ్లండ్ పై)

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. డునెడిన్‌ వేదికగా జ‌రిగిన మూడో టి20లో కివీస్ 45 ప‌రుగుల తేడాతో పాక్‌పై విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 224 పరుగులు చేయగా.. ఛేదనలో పాక్ 179 పరుగులకే పరిమితమైంది.