NZ vs PAK: 400 కాదు.. 450 అయినా ఛేదిస్తాం..: బాబర్ ఆజామ్

NZ vs PAK: 400 కాదు.. 450 అయినా ఛేదిస్తాం..: బాబర్ ఆజామ్

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించగానే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ కు కొమ్ములు మొలిశాయి. ప్రత్యర్థి జట్ల బౌలర్లను తేలిగ్గా తీసిపారేస్తూ మీడియా సమావేశంలో గొప్పలకుపోయాడు. పాక్ బ్యాటర్లు ఫామ్‌లో ఉన్నప్పుడు ప్రత్యర్థి జట్లు నిర్ధేశించే లక్ష్యం ఎంతున్నా ఛేదిస్తామని విర్రవీగాడు. అది 400 అయినా.. 450 అయినా ఒకటే అని తెలిపాడు.

పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఎప్పుడు.. ఎలా ఆడుతుందో అందరికీ విదితమే. గెలిచే మ్యాచ్‌లో ఓడటం వారికి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి  ఓటములు వారి ఖాతాలో ఎన్నో ఉన్నాయి. ఫఖర్ జమాన్(126 నాటౌట్) ధాటిగా ఆడడంతోనే న్యూజిలాండ్‌పై గెలిచారన్నది వాస్తవమే అయినా.. వరుణుడి పాత్ర మరువకూడదు. 402 పరుగుల భారీ ఛేదనలో వరుణుడు వారికి బాగానే సాయపడ్డాడు. ఫలితంగా వికెట్లు చేతిలో ఉండడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో గట్టెక్కారు. కాకపోతే పాక్ కెప్టెన్ ఈ నిజాన్ని అంగీకరించడం లేదు. మేఘాలు అకస్మాత్తుగా వచ్చాయని.. అవి రాకపోయినా లక్ష్యం 450 అయినా చేధించేవారిమని తెలిపాడు. 

"మా మనస్సులో వర్షం పడాలనే ఆలోచనే లేదు. మేఘాలు అకస్మాత్తుగా వచ్చాయి.. వెంటనే మేం డక్ వర్త్ లూయిస్ పద్ధతిని లెక్కించడం మొదలుపెట్టాం. రన్ రేట్ తగ్గకుండా.. వికెట్లు కోల్పోకుండా ఉండేలా చూసుకున్నాం.. ఫఖర్ ఆడిన తీరు చూస్తే 450 అయిన ఛేదించగలం అనిపించింది.. అంత బాగా రాణించాడు. నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఇది ఒకటి. ఇక ముందు కూడా అంతే.  ఇలానే దూకుడు కొనసాగిస్తాం.." అని బాబర్ ఆజామ్ వెల్లడించాడు.

పాక్ సెమీస్ ఆశలు సజీవం

ఇక న్యూజిలాండ్‌పై విజయంతో పాక్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకూ 8 మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ నాలుగింటిలో విజయం సాధించి.. ఐదో స్థానంలో( 8 పాయింట్లు) ఉంది. ఇక మిగిలింది ఒకే ఒక్క మ్యాచ్. తమ చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో వారు భారీ విజయం సాధించాలి. అలాగే, శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోవాలి. ఈ రెండూ జరిగితే పాక్ సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి.

ALSO  READ : ODI World Cup 2023: ఆ బుర్ర ఎవరిదో దేవుడికే తెలియాలి.. పాకిస్తాన్ కోచ్‌పై సెహ్వాగ్ సెటైర్లు