క్రికెట్ చరిత్రలో మరో సంచలనం.. పసికూన జట్టు చేతిలో ఓడిన న్యూజిలాండ్

క్రికెట్ చరిత్రలో మరో సంచలనం.. పసికూన జట్టు చేతిలో ఓడిన న్యూజిలాండ్

అసోసియేట్ దేశాలతో మ్యాచ్ అంటే.. అగ్రశ్రేణి జట్లకు చులకన. ఎలాగూ విజయం మనదేగా అన్న ధీమాతో ద్వితీయ శ్రేణి ఆటగాళ్లకు బరిలోకి దింపుతుంటారు. బలమైన జట్లలో ఒకటిగా పేరొందిన న్యూజిల్యాండ్‌ అలాంటి పని చేసి.. ఫలితం మూటగట్టుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కివీస్ జింబాబ్వే కన్నా పసికూన జట్టైన యూఏఈ చేతిలో ఓడింది.   

ఈ రెండు జట్లు దుబాయ్ వేదికగా మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్ ఆడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో విజయం అంచుల వరకూ వచ్చి ఓటమిపాలైన యూఏఈ.. రెండో టీ20లో మాత్రం కివీస్ జట్టుకు ఓటమి రుచి చూపించింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై యూఏఈకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్.. యూఏఈ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో చాప్‌మాన్‌(63) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. యూఏఈ బౌలర్లలో ఆయాన్‌ ఖాన్‌ 3 వికెట్లతో తీసుకోగా.. జవదుల్లా 2, నసీర్‌, మహ్మద్‌ ఫరాజుద్దీన్ తలా వికెట్‌ సాధించారు.

మహ్మద్‌ వసీం మెరుపులు

అనంతరం145 పరుగుల లక్ష్యచేధనకు దిగిన యూఏఈ 26 బంతులు మిగిలివుండగానే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యూఏఈ బ్యాటర్లలో కెప్టెన్‌ మహ్మద్‌ వసీం(55; 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్‌ సెంచరీతో చెలరేగగా.. ఆసీఫ్‌ ఖాన్‌(48 నాటౌట్‌) పరుగులతో రాణించాడు. కివీస్‌ బౌలర్లలో సౌథీ, శాంట్నర్‌, జేమీసన్ తలా వికెట్‌ సాధించారు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమం అయ్యింది. ఇక ఈ ఇరు జట్ల మధ్య సిరీస్‌ డిసైడర్‌ మూడో టీ20 దుబాయ్‌ వేదికగా ఆదివారం జరగనుంది.