టాలీవుడ్ లో చిన్న సినిమాలపై వివక్ష జరుగుతుందంటూ 'ఓ అందాల రాక్షసీ' హీరో, నిర్మాత షిరాజ్ మెహదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోమంది శ్రమతో, అద్భుత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించిన తమ చిత్రానికి థియేటర్లు దక్కకుండా పెద్దల వ్యవస్థ తొక్కిపెడుతోందని ఆరోపించారు. సరైన స్క్రీన్స్ కేటాయిస్తే చిన్న సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ అన్యాయంపై ఇప్పటివరకు 40కి పైగా ప్రెస్ మీట్లు, 50 ఇంటర్వ్యూలు ఇచ్చినా పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెన్సార్ రూల్స్, ఏడీసీసీ (ADCC) ప్రాసెస్ పేరుతో చిన్న నిర్మాతల నుంచి లక్షలాది రూపాయలు పిండుకుంటున్నారని మండిపడ్డారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ చిన్న నిర్మాతలకు అండగా నిలవాల్సింది పోయి, నల్లుల తరహాలో నలిపేస్తోందని ధ్వజమెత్తారు. ఐనాక్స్, పివిఆర్, ఏషియన్ వంటి మల్టీప్లెక్స్ దిగ్గజాలు మొదట షోలు ఇస్తామని చెప్పి హ్యాండ్ ఇచ్చాయని, దీంతో వాటిపై చట్టపరంగా హైకోర్టు ద్వారా సమన్లు పంపినట్లు వెల్లడించారు.
►ALSO READ | మనిషి శరీరాన్ని ముక్కలుగా నరికి.. నరనరాల్లో వణుకు పుట్టించేస్తున్న 'మయూఖ' ట్రైలర్!
పరిశ్రమలోని ఈ మాఫియా పోకడలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని, చిన్న సినిమాలకు థియేటర్లలో రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అంతేకాకుండా సినీ డ్రైవర్లు, మేకప్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సంక్షేమం కోసం ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని కోరారు.
తనకు ఎంతటి బెదిరింపులు వచ్చినా, ప్రాణాలు పోయినా సరే చిన్న సినిమాల హక్కుల కోసం ఈ పోరాటం ఆగదని షిరాజ్ స్పష్టం చేశారు.. అన్ని అడ్డంకులను అధిగమించి త్వరలోనే 'ఓ అందాల రాక్షసీ' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు.
