
- 2035 నాటికి ప్రపంచంలో సగం కంటే ఎక్కువ మందికి అధిక బరువు సమస్య
- వివరాలు వెల్లడించిన సీసీఎంబీ డాక్టర్ గిరిరాజ్ రతన్ చందక్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఊబకాయం ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, యువకులు, పెద్దలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, ఇది డయాబెటిస్, గుండె జబ్బులు, ఎముకలు, పునరుత్పత్తి సమస్యలు, క్యాన్సర్ల వంటి రోగాలను పెంచుతోందని సీసీఎంబీ డాక్టర్ గిరిరాజ్ రతన్ చందక్ అన్నారు. భారత్, దక్షిణాసియా ఇతర ప్రాంతాల్లో డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బుల రేట్లు ఎక్కువగా ఉండడంతో ఊబకాయం తీవ్ర సమస్యగా మారిందని తమ పరిశోధనలో వెల్లడైందన్నారు. 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
అంతర్జాతీయ స్టడీలో 600 మంది పరిశోధకులు, 500 సంస్థల సహకారంతో, 50 లక్షల మంది వ్యక్తుల జన్యు సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధన ఫలితాలను వివరించారు. తమ రీసెర్చ్‌లో భారత్ తో సహా వివిధ దేశాల నుంచి సేకరించిన డేటాను పరిశీలించామన్నారు. పిల్లలు, యువకుల్లో యవ్వనంలో ఊబకాయం వచ్చే ప్రమాదాన్ని ముందుగా ఊహించే పాలిజెనిక్ రిస్క్ స్కోర్(పీఆర్ఎస్) అనే జన్యు పరీక్షను అభివృద్ధి చేశామన్నారు. ఈ ఆవిష్కరణ ద్వారా, అధిక జన్యు ప్రమాదం ఉన్న పిల్లలు, యువకులను చిన్న వయస్సులోనే గుర్తించి, జీవనశైలి మార్పుల వంటి నివారణ చర్యలు అందించవచ్చన్నారు. ఐదేండ్ల వయస్సులోనే ఒక పిల్లవాడు యంగ్ఏజ్లో ఊబకాయంతో బాధపడే ప్రమాదాన్ని ఈ స్కోర్ ఊహించగలదన్నారు.
మనదేశంలో మధ్య కడుపులోనే..
భారతీయుల్లో ఊబకాయం.. యూరప్‌తో పోలిస్తే భిన్నంగా ఉందని, ముఖ్యంగా కడుపు భాగంలో(సెంట్రల్) ఊబకాయం ఎక్కువగా కనిపిస్తుందని రతన్ చందక్ తెలిపారు. ఈ స్టడీలో డయాబెటిస్ ఉన్నవారితో పాటు సాధారణ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఉన్నవారిని కూడా చేర్చారు. ఒక వ్యక్తి ఆహారం, వ్యాయామం, బరువు తగ్గించే ప్రయత్నాలను కూడా పరిశీలించారు. యూరోపియన్లలో గుర్తించిన జన్యు వైవిధ్యాలు భారతీయుల్లో తక్కువ ప్రమాదాన్ని ఊహిస్తుండగా, పర్యావరణ సంబంధిత జన్యు మార్పులు, జీవనశైలి, ఆహారం, పోషణ భారతీయుల్లో ఊబకాయంపై ఎక్కువ ప్రభావం చూపుతాయని తేలింది. జన్యు ప్రమాదం నేపథ్యంలో జీవనశైలి పరిష్కారాలు, నిర్దిష్ట పోషకాహార సప్లిమెంటేషన్ భారతీయులకు మెరుగైన ఫలితాలను ఇవ్వవచ్చని స్టడీ సూచిస్తోంది.